నారసింహ శతకం 21 నుండి 30 వరకు శ్లోకాలు
21
తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావ
మఱదులన్నలు మేనమామగారు
ఘనముగా బంధువుల్ గల్గినప్పటికైన
దాను దర్లగ వెంటదగిలి రారు
యముని దూతలు ప్రాణ మపహరించుక పోగ
మమతతో బోరాడి మాన్పలేరు
బలగ మందఱు దుఃఖపడుట మాత్రమే కాని
యించుక యాయుష్య మియ్యలేరు
చుట్టములమీది భ్రమదీసి చూర జెక్కి
సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

22
ఇభరాజవరద ! నిన్నెంత బిల్చినగాని
మాఱు పల్క వదేమి మౌనితనమొ?
మునిజనార్చిత ! నిన్ను మ్రొక్కి వేడినగాని
కనుల జూడ వదేమి గడుసుదనమొ?
చాల దైన్యమునొంది చాటు చొచ్చినగాని
భాగ్య మియ్య వదేమి ప్రౌఢతనమొ?
స్థిరముగా నీపాద సేవ జేసెద నన్న
దొరకజాల వదేమి ధూర్తతనమొ?
మోక్షదాయక ! యిటువంటి మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి కడుపునిండు.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

23
నీమీద కీర్తనల్ నిత్యగానము జేసి
రమ్యమొందింప నారదుడగాను
సావధానముగ నీ చరణ పంకజ సేవ
సలిపి మెప్పంపంగ శబరిగాను
బాల్యమప్పటినుండి భక్తి నీయందున
గలుగను బ్రహ్లాద ఘనుడగాను
ఘనముగా నీమీది గ్రంథముల్ గల్పించి
వినుతిసేయను వ్యాస మునినిగాను
సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను
హీనుడను జుమ్మి నీవు నన్నేలుకొనుము.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

24
అతిశయంబుగ గల్ల లాడనేర్చితిగాని
పాటిగా సత్యముల్ పలుకనేర
సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితిగాని
యిష్ట మొందగ నిర్వ హింపనేర
నొకరి సొమ్ముకు దోసి లొగ్గ నేర్చితిగాని
చెలువుగా ధర్మంబు సేయనేర
ధనము లియ్యంగ వద్దనగ నేర్చితిగాని
శీఘ్ర మిచ్చెడునట్లు చెప్పనేర
బంకజాతాక్ష ! నే నతిపాతకుడను
దప్పులన్నియు క్షమియింప దండ్రి వీవె !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

25
ఉర్విలో నాయుష్య మున్న పర్యంతంబు
మాయ సంసారంబు మరగి నరుడు
సకల పాపములైన సంగ్రహించును గాని
నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు
తుదకు గాలునియొద్ది దూత లిద్దఱు వచ్చి
గుంజుక చని వారు గ్రుద్దుచుండ
హింస కోర్వగ లేక యేడ్చి గంతులువేసి
దిక్కు లేదని నాల్గు దిశలు చూడ
దన్ను విడిపింప వచ్చెడి ధన్యుడేడి
ముందు నీదాసుడై యున్న ముక్తి గలుగు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

26
అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి
సత్యవంతులమాట జన విరోధంబాయె
వదరుబోతులమాట వాసికెక్కె
ధర్మవాదనపరుల్ దారిద్ర్యమొందిరి
పరమలోభులు ధన ప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి
దుష్టమానవులు వర్ధిష్ణులైరి
పక్షివాహన ! మావంటి భిక్షుకులకు
శక్తిలేదాయె నిక నీవె చాటు మాకు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

27
భుజబలంబున బెద్ద పులుల జంపగవచ్చు
పాముకంఠము జేత బట్టవచ్చు
బ్రహ్మ రాక్షసకోట్ల బాఱద్రోలగవచ్చు
మనుజుల రోగముల్ మాన్పవచ్చు
జిహ్వ కిష్టముగాని చేదు మ్రింగగవచ్చు
బదను ఖడ్గము చేత నదమవచ్చు
గష్టమొందుచు ముండ్ల కంపలో జొరవచ్చు
దిట్టుబోతుల నోళ్లు కట్టవచ్చు
బుడమిలో దుష్టులకు ఙ్ఞాన బోధ తెలిపి
సజ్జనుల జేయలే డెంత చతురుదైన.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

28
అవనిలోగల యాత్రలన్ని చేయగవచ్చు
ముఖ్యుడై నదులందు మునుగవచ్చు
ముక్కుపట్టుక సంధ్య మొనసి వార్వగవచ్చు
దిన్నగా జపమాల ద్రిప్పవచ్చు
వేదాల కర్థంబు విఱిచి చెప్పగవచ్చు
శ్రేష్ఠ్ క్రతువు లెల్ల జేయవచ్చు
ధనము లక్షలు కోట్లు దానమియ్యగవచ్చు
నైష్ఠికాచారముల్ నడుపవచ్చు
జిత్త మన్యస్థలంబున జేరకుండ
నీ పదాంభోజములయందు నిలపరాదు.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

29
కర్ణయుగ్మమున నీ కథలు సోకినజాలు
పెద్ద పోగుల జోళ్లు పెట్టినట్లు
చేతు లెత్తుచు బూజ సేయగల్గినజాలు
తోరంపు కడియాలు దొడిగినట్లు
మొనసి మస్తకముతో మ్రొక్క గల్గినజాలు
చెలువమైన తురాయి చెక్కినట్లు
గళము నొవ్వగ నిన్ను బలుక గల్గినజాలు
వింతగా గంఠీలు వేసినట్లు
పూని నిను గొల్చుటే సర్వ – భూషణంబు
లితర భూషణముల నిచ్చ – గింపనేల.
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

30
భువనరక్షక !నిన్ను బొగడనేరని నోరు
వ్రజ కగోచరమైన పాడుబొంద
సురవరార్చిత ! నిన్ను జూడగోరని కనుల్
జలములోపల నెల్లి సరపుగుండ్లు
శ్రీరమాధిమ ! నీకు సేవజేయని మేను
కూలి కమ్ముడువోని కొలిమితిత్తి
వేడ్కతో నీకథల్ వినని కర్ణములైన
గఠినశిలాదుల గలుగు తొలలు
పద్మలోచన నీమీద భక్తిలేని
మానవుడు రెండుపాదాల మహిషమయ్య
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

No comments:
Post a Comment