కుమార శతకం 71 నుండి 80 వరకు శ్లోకాలు
ధర నొక్క బుద్ధిహీనున్
దిరముగ రోటనిడి దంచేనేనియు, బెలుచం
దురు, యగును గాని యతనికి
సరసత్వము గలుగదండ్రు సతము కుమారా!
భావం
ఓ కుమార! బుద్ధిలేనివానిని రోటిలో దంచిననూ బుద్ధిరాదు. వాని బుద్ధిహీనత ఎక్కువ అగును. చతురత మాత్రం వానికి ఎన్నిటికి కలుగదు.
72 వ శ్లోకం
పుడమిని దుష్టత గల యా
తడు లంచంబులు బట్ట దలుచుచు మిడియౌ
నడవడి విడి యందరి వెం
బడి ద్రిప్పికొనుచును గీడు వరుప కుమారా!
భావం
ఈ కుమారా! ఈ ఇలలో చెడ్డబుద్ధిగలవారు, గర్వముతో లంచములను పుచ్చుకొనదలంతురు. తమతో అవసరం కల్గిన మనుష్యులకు, కష్టములను కలిగించు స్వభావముతో తమవెంట పలుమార్లు త్రిప్పించుకొందురు.
73 వ శ్లోకం
సదమల మతితోఁ బెద్దల
మదికింపుగ మెలగు, నింద మానుము పరులన్
మృదు మార్గములను వదలకు
విదితంబుగ దాన: గీర్తి వెలయుఁ గుమారా!
భావం
ఓ కుమారా! పెద్దలు సంతోషించునట్ల్లు నిర్మలమైన మనస్సుతో మెలగుము. ఇతరులను నిందించుట మానవలెను. మంచిపద్ధతులను విడిచిపెట్టకు. ఈ విధముగ నడుచుకొన్నచో మంచిపేరు వచ్చును.
74 వ శ్లోకం
పుట్టినది మొదలు పర సతి
బట్టగఁ జూచుటయు నింద పద్ధతి యను చు
న్నట్టి పురుషుండు పుడమిం
బుట్టిన జనతతుఅలఁ గీర్తిబొందుఁ గుమారా!
భావం
ఓ కుమారా! పుట్టినప్పటినుండి ఇతరుల భార్యలను చెరపట్టవలెనని చూచుటవలన నిందల పాలగును. అనుభవమును మనస్సునందుంచుకొని మెలగవలెను. అట్టివాడు ప్రజలచేత గీర్తింపబడును.
75 వ శ్లోకం
ధరణిని పరోపకారా
చరణ వ్రతనిష్ట నెపుడు సలుపుము నీకా
తెర గుపవాసాది వ్రత
వరకర్మము కంటె మేలు వచ్చు కుమారా!
భావం
ఓ కుమారా! ఈ భూమి, యందెల్లప్పుడును ఇతరులకు సహాయము చేయుచుండుము. నియమ, నిష్టలతో వ్రతములకు చేయుము. వ్రతములు చేయుట వలన వచ్చు ఫలము కన్ననూ, ఇతరులకు మేలు చేయుటవలన కలుగు ఫలితమే గొప్పదని తెలుసుకొనుము.
76 వ శ్లోకం
విను లోకంబున ధర్మం
బనగఁ గులాచారమట్ల నరసి నడువఁ దా
గను మాయుః కీర్తుల నిహ
మునఁ బరమునఁ బొందు సౌఖ్యములను గుమారా!
భావం
ఓ కుమారా! లోకమందు కులాచారమును తెలుసుకొని మసలుటయే ధర్మమనబడును. దీనివలన కీర్తిప్రతిష్టలు, ఆయుష్యు, ఇహపరసౌఖ్యములు కలుగును. ఈ విషయమును గమనించి నడుచుకొనుము.
77 వ శ్లోకం
సరి వారి లోన నేర్పున
దిరిగెడి వారలకు గాక తెరువాటులలో
సరయుచు మెలగెడి వారికి
పరు వేటికి గీడె యనుభవంబు కుమారా!
భావం
ఓ కుమారా! నీ తోటివారలతో మెలగునపుడు మంచి తెలివితేటలతో మెలగవలెను. సజ్జనుల సాంగత్యము చేయుము. అట్లుగాక దుష్టుల, దొంగల స్నేహము చేయువారికి గౌరవముండదు. చివరకు ఆపదయే సంప్రాప్తించును.
మనుజుడు సభ్యుడు దానై
కనియున్న యదార్థమెల్ల కానిన యట్లా
మనుజుండు పలుకకున్నను
ఘనమగు పాతకము నాడు గనును కుమారా!
భావం
ఓ కుమారా! ఉచితానుచితములు తెలుసుకొని మనిషి నడుచుకొనవలెను. తను తెలుసుకొన్న సత్యమును నిర్భయముగా చెప్పగలిగి యుండాలి. చూచిన దానిని చూడనట్లుగా పలుకరాదు. అట్లు చేసిన మిక్కిలి పాపములు అంటును.
79 వ శ్లోకం
అంగీకార రహితమగు
సంగతికిం బోవరాదు సామాన్యుల తో
డం గడు జగడమునకు జన
వెంగలితనమంద్రు జనులు వినుము కుమారా!
భావం
ఓ కుమారా! అంగీకారముకాని విషయముల జోలికి వెళ్ళకుము. సామాన్యులతో పోట్లాడకుము. అట్లు చేసిన జనులు నిన్ను అవివేకియందురు. ఈ విషయమును గ్రహించి మసలు కొనుము.
80 వ శ్లోకం
ధీరుడు తనదగు సంపద
జారిన యెడ జింత నొందజాలక దా ల
క్శ్మీరమణుని వర చరణం
భోరుహములు గొలిచి ముక్తిబొందు కుమారా!
భావం
ఓ కుమారా! ధైర్యవంతుడు తన సంపదలు పోయిననూ విచారింపడు. నిబ్బరముతో ఉంటాడు. లక్ష్మీరమణుడైన శ్రీమహావిష్ణువుయొక్క పాదపద్మములను సేవించుచూ మోక్షప్రాప్తిని పొందుతాడు.
No comments:
Post a Comment