నారసింహ శతకం 61 నుండి 70 వరకు
61
విద్య నేర్చితి నంచు విఱ్ఱవీగగలేదు
భాగ్యవంతుడ నంచు బలుకలేదు
ద్రవ్యవంతుడ నంచు దఱచు నిక్కగలేదు
నిరతదానములైన నెఱపలేదు
పుత్రవంతుడ నంచు బొగడుచుండగలేదు
భ్రుత్యవంతుడ నంచు బొగడలేదు
శౌర్యవంతుడ నంచు సంతసింపగలేదు
కార్యవంతుడ నంచు గడపలేదు
నలుగురికి మెప్పుగానైన నడువలేదు
నళినదళనేత్ర ! నిన్ను నే నమ్మినాను
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
62
అతిలోభులను భిక్ష మడుగబోవుట రోత
తనద్రవ్య మొకరింట దాచ రోత
గుణహీను డగువాని కొలువు గొల్చుట రోత
యొరుల పంచలక్రింద నుండ రోత
భాగ్యవంతుని తోడ బంతమాడుట రోత
గుఱిలేని బంధుల గూడ రోత
ఆదాయములు లేక యప్పుదీయుట రోత
జార చోరుల గూడి చనుట రోత
యాదిలక్ష్మీశ ! నీబంట నైతినయ్య !
యింక నెడబాసి జన్మంబు లెత్త రోత
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
63
వెఱ్ఱివానికి నేల వేదాక్షరంబులు?
మోటువానికి మంచి పాట లేల?
పసులకాపరి కేల పరతత్త్వబోధలు?
విటకాని కేటికో విష్ణుకథలు?
వదరు శుంఠల కేల వ్రాత పుస్తకములు?
తిరుగు ద్రిమ్మరి కేల దేవపూజ?
ద్రవ్యలోభికి నేల ధాతృత్వ గుణములు?
దొంగబంటుకు మంచి సంగతేల?
క్రూరజనులకు నీమీద గోరి కేల?
ద్రోహి పాపాత్మునకు దయా దుఃఖ మేల?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
64
నా తండ్రి ! నాదాత ! నాయిష్టదైవమా !
నన్ను మన్ననసేయు నారసింహ !
దయయుంచు నామీద దప్పులన్ని క్షమించు
నిగమగోచర ! నాకు నీవె దిక్కు
నే దురాత్ముడ నంచు నీమనంబున గోప
గింపబోకుము స్వామి ! కేవలముగ
ముక్తిదాయక నీకు మ్రొక్కినందుకు నన్ను
గరుణించి రక్షించు కమలనాభ !
దండిదొర వంచు నీవెంట దగిలినాను
నేడు ప్రత్యక్షమై నన్ను నిర్వహింపు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
65
వేమాఱు నీకథల్ వినుచు నుండెడివాడు
పరుల ముచ్చటమీద భ్రాంతి పడడు
అగణితంబుగ నిన్ను బొగడ నేర్చినవాడు
చెడ్డమాటలు నోట జెప్పబోడు
ఆసక్తిచేత నిన్ననుసరించెడివాడు
ధనమదాంధులవెంట దగుల బోడు
సంతసంబున నిన్ను స్మరణజేసెడివాడు
చెలగి నీచులపేరు దలపబోడు
నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగ
గోరి చిల్లర వేల్పుల గొల్వబోడు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
66
నే నెంత వేడిన నీ కేల దయరాదు?
పలుమాఱు పిలిచిన బలుక వేమి?
పలికిన నీ కున్న పద వేమిబోవు? నీ
మోమైన బొడచూప వేమి నాకు?
శరణు జొచ్చినవాని సవరింపవలె గాక
పరిహరించుట నీకు బిరుదు గాదు
నీదాసులను నీవు నిర్వహింపక యున్న
బరులెవ్వ రగుదురు పంకజాక్ష !
దాత దైవంబు తల్లియు దండ్రి వీవె
నమ్మియున్నాను నీపాద నళినములను
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
67
వేదముల్ చదివెడు విప్రవర్యుండైన
రణము సాధించెడు రాజెయైన
వర్తకకృషికుడౌ వైశ్యముఖ్యుండైన
బరిచగించెడు శూద్ర వర్యుడయిన
మెచ్చుఖడ్గము బట్టి మెఱయు మ్లేచ్ఛుండైన
బ్రజల కక్కఱపడు రజకుడైన
చర్మ మమ్మెడి హీన చండాలనరుడైన
నీ మహీతలమందు నెవ్వడైన
నిన్ను గొనియాడుచుండెనా నిశ్చయముగ
వాడు మోక్షాధికారి యీ వసుధలోన
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
68
సకలవిద్యలు నేర్చి సభ జయింపగవచ్చు
శూరుడై రణమందు బోరవచ్చు
రాజరాజై పుట్టి రాజ్య మేలగవచ్చు
హేమ గోదానంబు లియ్యవచ్చు
గగనమం దున్న చుక్కల నెంచగావచ్చు
జీవరాసుల పేర్లు చెప్పవచ్చు
అష్టాంగ యోగములభ్యసింపగవచ్చు
మేక రీతిగ నాకు మెసవవచ్చు
తామరసగర్భ హర పురం దరులకైన
నిన్ను వర్ణింప దరమౌనె నీరజాక్ష !
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
69
నరసింహ ! నీవంటి దొరను సంపాదించి
కుమతి మానవుల నే గొల్వజాల
నెక్కు వైశ్వర్యంబు లియ్యలేకున్నను
బొట్టకు మాత్రము పోయరాదె?
ఘనముగాదిది నీకు కరవున బోషింప
గష్ట మెంతటి స్వల్ప కార్యమయ్య?
పెట్టజాలక యేల భిక్షమెత్తించెదు
నన్ను బీదను జేసినా వదేమి?
అమల ! కమలాక్ష ! నే నిట్లు శ్రమపడంగ
గన్నులకు బండువై నీకు గానబడునె?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
70
వనరుహనాభ ! నీ వంక జేరితి నేను
గట్టిగా నను గావు కావు మనుచు
వచ్చినందుకు వేగ వరము లియ్యకకాని
లేవబోయిన నిన్నులేవనియ్య
గూర్చుండబెట్టి నీ కొంగు గట్టిగ బట్టి
పుచ్చుకొందును జూడు భోగిశయన !
యీవేళ నీ కడ్డ మెవరు వచ్చినగాని
వారికైనను లొంగి వడకబోను
గోపగాడను నీవు నా గుణము తెలిసి
యిప్పుడే నన్ను రక్షించి యేలుకొమ్ము
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !
No comments:
Post a Comment