September 10, 2013

నారసింహ శతకం 41 నుండి 50 వరకు శ్లోకాలు

నారసింహ శతకం 41 నుండి 50 వరకు 
41
ఇలలోన నే జన్మమెత్తినప్పటినుండి
బహు గడించితినయ్య పాతకములు
తెలిసి చేసితి గొన్ని తెలియజాలక చేసి
బాధ నొందితి నయ్య పద్మనాభ
అనుభవించెడు నప్పుదతి ప్రయాసంబంచు
బ్రజలు చెప్పగ జాల భయము గలిగె
నెగిరి పోవుటకునై యే యుపాయంబైన
జేసి చూతమటన్న జేతగాదు

సూర్యశశినేత్ర ! నీచాటు జొచ్చి నాను
కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

42
తాపసార్చిత ! నేను పాపకర్ముడనంచు
నాకు వంకలబెట్ట బోకుచుమ్మి
నాటికి శిక్షలు నన్ను చేయుటకంటె
నేడు సేయుము నీవు నేస్తమనక
అతిభయంకరులైన యమదూతలకు నన్ను
నొప్పగింపకు మయ్య యురగశయన !
నీ దాసులను బట్టి నీవు దండింపంగ
వద్దు వద్దన రెంత పెద్దలైన

దండ్రివై నీవు పరపీడ దగులజేయ
వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

43
ధరణిలోపల నేను తల్లిగర్భమునందు
బుట్టినప్పటినుండి పుణ్యమెఱుగ
నేకాదశీవ్రతం బెన్న డుండుగ లేదు
తీర్థయాత్రలకైన దిరుగలేదు
పారమార్థికమైన పనులు చేయగలేదు
భిక్ష మొక్కనికైన బెట్టలేదు
ఙ్ఞానవంతులకైన బూని మ్రొక్కగలేదు
ఇతర దానములైన నియ్యలేదు

నళినదళనేత్ర ! నిన్ను నే నమ్మినాను
జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

44
అడవిపక్షుల కెవ్వడాహార మిచ్చెను
మృగజాతి కెవ్వడు మేతబెట్టె
వన చరాదులకు భోజన మెవ్వ డిప్పించె
జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె
స్త్రీలగర్భంబున శిశువు నెవ్వడు పెంచె
ఫణుల కెవ్వడు పోసె బరగ బాలు
మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె
బసుల మెవ్వ డొసంగె బచ్చిపూరి

జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య వెదకిచూడ
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


45
దనుజారి ! నావంటి దాసజాలము నీకు
కోటి సంఖ్య గలారు కొదువ లేదు
బంట్లసందడివల్ల బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్య మహిమచేత
దండిగా భ్రుత్యులు దగిలి నీకుండంగ
బక్కబం టేపాటి పనికి నగును?
నీవు మెచ్చెడి పనుల్ నేను జేయగలేక
యింత వృథాజన్మ మెత్తినాను

భూజనులలోన నే నప్రయోజకుడను
గనుక నీ సత్కటాక్షంబు గలుగజేయు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !



46
కమలలోచన ! నన్ను గన్నతండ్రివిగాన
నిన్ను నేమఱకుంటి నేను విడక
యుదరపోషణకునై యొకరి నే నాశింప
నేర నా కన్నంబు నీవు నడపు
పెట్టలే నంటివా పిన్న పెద్దలలోన
దగవు కిప్పుడు దీయ దలచినాను
ధనము భారంబైన దలకిరీటము నమ్ము
కుండలంబులు పైడి గొలుసు లమ్ము

కొసకు నీ శంఖ చక్రముల్ కుదువబెట్టి
గ్రాసము నొసంగి పోషించు కపటముడిగి
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

47
కువలయశ్యామ ! నీ కొలువు చేసిన నాకు
జీత మెందుకు ముట్ట జెప్పవైతి
మంచి మాటలచేత గొంచెమియ్యగలేవు
కలహమౌ నిక జుమ్మి ఖండితముగ
నీవు సాధువు గాన నింత పర్యంతంబు
చనవుచే నిన్నాళ్లు జరుపవలసె
నిక నే సహింప నీవిపుడు నన్నేమైన
శిక్ష చేసిన జేయు సిద్ధమయితి

నేడు కరుణింపకుంటివా నిశ్చయముగ
దెగబడితి చూడు నీతోడ జగడమునకు
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

48
హరి ! నీకు బర్యంక మైన శేషుడు చాల
బవనము భక్షించి బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు
గొప్పపామును నోట గొఱుకుచుండు
అదిగాక నీ భార్య యైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి
ప్రేమ బక్వాన్నముల్ పెట్టుచుండ్రు

స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండు
గాసు నీ చేతి దొకటైన గాదు వ్యయము
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

49
పుండరీకాక్ష ! నా రెండు కన్నుల నిండ
నిన్ను జూచెడి భాగ్య మెన్నడయ్య
వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు
సొగసుగా నీరూపు చూపవయ్య
పాపకర్ముని కంట బడకపోవుదమంచు
బరుషమైన ప్రతిఙ్ఞ బట్టినావె?
వసుధలో బతిత పావనుడ వీ వంచు నే
బుణ్యవంతులనోట బొగడ వింటి

నేమిటికి విస్తరించె నీకింత కీర్తి
ద్రోహినైనను నా కీవు దొరకరాదె?
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !

50
పచ్చి చర్మపు దిత్తి పసలేదు దేహంబు
లోపల నంతట రోయ రోత
నరములు శల్యముల్ నవరంధ్రములు రక్త
మాంసంబు కండలు మైల తిత్తి
బలువైన యెండ వానల కోర్వ దింతైన
దాళలే దాకలి దాహములకు
సకల రోగములకు సంస్థానమె యుండు
నిలువ దస్థిరమైన నీటిబుగ్గ

బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత
గాటికే గాని కొఱగాదు గవ్వకైన
భూషణవికాస ! శ్రీధర్మ పురనివాస !
దుష్టసంహార ! నరసింహ దురితదూర !


No comments:

Post a Comment