November 10, 2013

కార్తీక మహాత్మ్యం ---- ఏడవరోజు కథ

కార్తీక మహాత్మ్యం ---- ఏడవరోజు కథ 

హరిహరులను పూజించే విధానము 

కార్తీక మహాత్మ్యం గూర్చి మనం ఎంత చెప్పుకున్న, విన్న తనివితీరదు. ఈ మాసంలో శ్రీహరిని బిల్వపత్రములు..... దొరకనిచో తులసీదళములతో కానీ,  విష్ణుసహస్రనామ పూజచేస్తే వారిని లక్ష్మీదేవి అనుగ్రహించి, ఆ ఇంట నివాసముంటుంది. ఉసిరి చెట్టు క్రింద భగవంతుని ఉంచి పూజించి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి.....వారు భుజించినచో సర్వపాపములు తొలగిపోవును.

కార్తీకస్నానములు, దీపారాధనలు చేయలేనివారు కనీసం సూర్యోదయ - సూర్యాస్తమయాలలో ఏదైనా కోవెలకి వెళ్ళి భక్తిగా నమస్కరించి, సాష్టాంగ నమస్కారం చేసినచో వారి పాపములు తొలగి కైవల్యం పొందుతారు.

కలిగి ఉన్నవారు హరిహర క్షేత్రాలకు వెళ్ళి, పూజలు, హోమాలు, దానధర్మాలు చేస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలితాన్ని పొందటమే కాక.....వారి పితృదేవతలు (పూర్వీకులు) కూడా వైకుంఠమునకు చేరుకుంటారు.

 హరిహర దేవాలయాల వద్ద ఝండా ఎగురవేసినచో వారి మరణానంతరము యమకింకరులు దరికిరారు.....వారు చేసిన కొన్ని కోట్ల పాపములు కూడా పోవును.

తులసికోట దగ్గర ఆవుపేడతో శుభ్రంగా అలికి, వరిపిండితో శంఖచక్ర ఆకారములో ముగ్గులు వేసి, ఆ ముగ్గులమీద నువ్వులు, ధాన్యము ఉంచి, వాటిపై నువ్వులనూనెతో నింపిన ప్రమిదలను ఉంచి, ప్రత్తివత్తును వేసి వెలిగించాలి. ఈదీపం అఖండ జ్యోతివలె రేయింబవళ్ళు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా పెట్టిన దీపాన్ని నందాదీపం అంటారు. అలా చేసినవారికి మరుజన్మ అనేది ఉండదు (మోక్షాన్ని పొందుతారు).

ఈశ్వరుడిని జిల్లేడు ఆకులతో పూజిస్తే ఆయుష్షు పెరుగుతుంది. సాలగ్రామమునకు నిత్యమూ గంధము రాసి, తులసిదళములతో పూజించాలి.

ధనము కలిగినవారు.......ధనము ఉండీ దానధర్మములు చేయక, పూజలు చేయకపోతే అటువంటివారు మరుజన్మలో కుక్కలుగా జన్మించి, ఆహారము దొరకక, ప్రతిఒక్కరితో దెబ్బలు - తిట్లు తింటూ చాలా నీచంగా తమ జీవనం గడుపుతారు.

ఈ మాసమంతా పూజలు వ్రతాలు చేయలేనివారు .....కనీసం ఒక్క సోమవారమైనా నియమానుసారం శివకేశవులను పూజిస్తే ఈ మాసఫలితం దక్కుతుంది.

"నమశ్శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరా శ్లిష్ట వపుర్థరాభ్యాం
నాగేంద్రకన్యా వృష కేతనాభ్యాంనమో నమ శ్శంకర పార్వతీభ్యాం "

-:ఏడవరోజు పారాయణం సమాప్తం:-    


2 comments: