కార్తీకమాస మహాత్మ్యం ----- నాలుగవరోజు కథ
వశిష్ఠుడు కార్తీకమాస వ్రతము యొక్క మహిమవల్ల బ్రహ్మరాక్షసులు వారి జన్మనుండి విముక్తి పొందారని చెబుతూఉంటే, జనకుడు "తపస్వీ ! మీరు చెప్పిన ఇతిహాసాలు వింటూ ఉంటే, తనివి తీరటం లేదు. ఈ మాసంలో ముఖ్యంగా ఎమిటేంటి చెయ్యాలో, ఏవిధంగా పూజ చెయ్యాలో వివరంగా తెలియచేయండి" అని అడుగగా వశిష్టులవారు ఈ విధంగా తెలియచేస్తున్నారు.
కార్తీకమాసమునందు దీపారాధన చేయుటవలన చాలా మంచి ఫలములను పొందుతారు,అందువల్ల సూర్యోదయము లేక -- సూర్యాస్తమయ సమయాలలో ఎప్పుడైనా శివాలయంలో లేదా వైష్ణవాలయంలో కానీ దీపారాధన చేయుట చాలా ముఖ్యము. ఆ విధంగా చేసినవారికి సర్వపాపాలు పోయి, శివసాన్నిధ్యము చేరుకుంటారు. దీపాలు వెలిగించటానికి ఆవునెయ్యి - కొబ్బరినూనె - నువ్వులనూనె -- వీటిలో ఏదైనా వాడవచ్చును ....... ఏవి లేకుంటే ఆముదంతోనైనా వెలిగించవచ్చును. దీపారాధన ఏ నూనెతో చేసినా పుణ్యాత్ములై శివసన్నిధి చేరుకుంటారు.
శత్రుజిత్ కథ:-
పాంచాల దేశపు రాజుకి పిల్లలు లేక అనేక యజ్ఞాలు చేసి చివరికి విసుగు చెంది గోదావరీ నది ఒడ్డున తపస్సు చేస్తుండగా అక్కడకు పిప్పలాదుడు అనే ముని వచ్చి నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అందుకు రాజు, తనకు సంతానం కోసం తపస్సు చేస్తునట్టు చెప్పాడు. అంతట ఆ ముని కార్తీక మాసంలో శివసన్నిధిలో దీపారాధన చేస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పి వెళిపోయాడు.
వెంటనే రాజు తన దేశానికి వెళ్ళి శివాలయంలో కార్తీక మాసం నెల రోజులూ దీపారాధన చేసి, దాన ధర్మాలు చేస్తూ, నియమాలను ఆచరిస్తూ వ్రతం చేసి, ప్రజలందరికీ ప్రసాదాలు పంచి పెట్టాడు. దాని ఫలితంగా రాజుకి ఒక కొడుకు జన్మించాడు. అతనికి శత్రుజిత్తు అని పేరు పెట్టాడు. ఆ రాకుమారుడు అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. కానీ యవ్వన వయసులో దుష్టుల సహవాసంతో చెడుతిరుగుళ్ళు తిరుగుతూ చెడిపోయెను.
రాజు - రాణి కూడా కొడుకు దురలవాట్లని, దురుసు స్వభావాన్ని చూసి కూడా ఏమీ చేయలేకపోయారు. ఒకరోజు అతి రూపలావణ్యాలు కలిగిన ఒక బ్రాహ్మణునిభార్య రాకుమారుడి కంటపడెను. ఆమెను సమీపించి తన కామవాంచ తెలియచేయగా...... ఆమె కూడా అతని రూపలావణ్యాలని చూసి మోహించి ..... అతనికి వశమయ్యెను.....ప్రతిదినము వారి ప్రేమాయణం అలాగే జరుగుచున్నది. ఒక దినమున ఆమె భర్తకి విషయము తెలిసి ఇద్దరినీ చంపుటకు నిశ్చయించుకొనెను.
కార్తీకపౌర్ణమి నాడు రాకుమారుడు - ఆమె ఇద్దరూ శివాలయంలో కలుసుకోవాలని అనుకున్నారు ..... ఆ విషయం ముందుగానే తెలుసుకున్న బ్రాహ్మణుడు వారిరువురను సంహరించుటకు కత్తిని చేతబూని ఆలయంలో వేచియున్నాడు. వారిరువురు ఆలయంలో కలుసుకొని ...... అక్కడ చీకటిగా ఉందని ఆమె తన చీరకొంగుని చింపి ఆలయంలోనున్న ఆముదపు ప్రమిదలో దీపారాధన చేసింది. అంతట వాళ్ళు ఇద్దరు ఆలింగనము చేసుకొన్న సమయము చూసి అక్కడే ఉన్న బ్రాహ్మణుడు ఇద్దరినీ కట్టివేటుతో హతమార్చి...... అతను కూడా ఆత్మహత్య చేసుకొనెను. ఆరోజు కార్తీకపౌర్ణమి ..... సోమవారము అవ్వుటవలన ప్రేమికులిద్దరనీ తీసుకుపోవుటకు శివదూతలు--- బ్రాహ్మణుని తీసుకుపోవుటకు యమదూతలు వచ్చిరి. అది చూసి బ్రాహ్మణుడు" కమాంధులై, పాపకార్యములు చేసిన వారిద్దరినీ శివదూతలు తీసుకువెళ్ళుట ఏమిటి? నన్ను మీరు తీసుకువెళ్ళుట ఏమిటి ?" అని యమదూతలని అడిగెను. "వారిద్దరూ ఎన్ని పాపకార్యములు చేసినా తెలిసో తెలియకో ఈ పవిత్రదినమున శివాలయంలో దీపారాధన చేయుట వలన వారు చేసిన పాపములు పోయి, కైలాసమునకు చేరుకుంటున్నారు." అని వారు బదులిచ్చారు. అదివిన్న రాకుమారుడు "మేము చేసిన పాపపుణ్యాలు ఎలాగ ఉన్నా ..... మేము ముగ్గురమూ ఒకే చోట , ఒకే సమయంలో మరణించాము కనుక ముగ్గురికీ ఆ పుణ్యఫలము ముగ్గురికీ చెందవలసిందే" అని చెప్పి అతను చేసిన దీపారాధన ఫలమును కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేసి.....ముగ్గురూ కూడా శివసాన్నిధ్యము చేరుకున్నారు.
శివాలయంలో దీపారాధన చేయుటవలన ఆ ప్రేమికులిరువురూ ఎన్ని పాపములు చేసినా, పాపములు తొలగి, శివుని చేరుకున్నారు. కావున కార్తికమసంలో నక్షత్రమాల యందు దీపారాధన చేసినవారు జన్మరాహిత్యం పొందెదరు.
నాలుగవరోజు పారాయణ సమాప్తం.
No comments:
Post a Comment