కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఏడవరోజు కథ
శ్రీమహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగెను "ఓ దూర్వాసా ! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపనిష్టుని వలె బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు, రాజు అయినందుకు గో, బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజు దండనీతితోనే ధర్మపరిపాలనమును చేయాలి కాని, బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు.
వేదవిదులు, సత్యధర్మనిరతులు, లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దోషియైన బ్రాహ్మణుని దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి, ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము, లేదా వస్త్రహరణము, స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప, రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మ శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు -- బ్రాహ్మణుడవైన నీకు తనవల్లనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు దుఃఖిస్తున్నాడు. కనుక నువ్వు తక్షణమే అంబరీషుని వద్దకు వెళ్ళు. తద్వారా మీ ఇరువురకూ శుభం కలుగుతుంది." అని విష్ణువు చెప్పగానే దూర్వాసుడు అమ్బరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయగ్రస్తుడైన దూర్వాసుని వీడి అతని మీదకు రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురువెళ్ళి "ఓ సుదర్శనమా ! నన్ను మన్నించు. భయభ్రాంతుడైన వానిని, అందునా బ్రాహ్మణుని ఈ విధంగా కౄరంగా హింసించటం న్యాయం కాదు. అంటూ ఇంకా ఇలా చెప్పసాగెను.
No comments:
Post a Comment