November 8, 2013

కార్తీకమాస మహాత్మ్యం ----- ఐదవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం ----- ఐదవరోజు కథ 

కార్తీకమాసంలో స్నానాలు, పూజలు, దానాలు మొదలైనవే కాకుండా ..... హరిహర దేవాలయాలలో భగవద్గీత పారాయణ తప్పనిసరిగా చేయాలి ..... అలా చేసినవారికి సర్వపాపాలు తొలగిపోతాయి. ఈ మాసంలో కరవీర పుష్పములతో శివకేశవులకి పూజ చేసినవారు వైకుంఠమునకు వెళతారు. ఈ మాసంలో పెద్ద ఉసిరికాయల (రాచఉసిరి) చెట్టు క్రింద భగవంతుని ధ్యానించి, సహపంక్తి భోజనము చేయవలెను.... బ్రాహ్మణులకి భోజనము పెట్టి శక్తి కొలది దక్షిణతాంబూలాలు ఇచ్చి,  పురాణ కాలక్షేపం చేయాలి......ఆ విధంగా చేసిన ఒక బ్రాహ్మణునికి నీచజన్మ పోయి, నిజరూపము కలిగి.... స్వర్గమునకు పోయెను.

కిరాత మూషికము మోక్షము పొందుట 

కావేరి నది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కొడుకు శివశర్మ ....గారాబంగా పెరుగుట వలన నీచులతో సావాసం చేసి.....చెడు తిరుగుళ్ళు  తిరిగేవాడు. కొడుకు ప్రవర్తన చూసి దేవశర్మ "నీ గురించి ప్రజలు చెడుగా చెప్పుకోవటం నాకు నచ్చటం లేదు, సహించలేకున్నాను .... ఈ (కార్తీక)మాసంలో నదిలో శుచిగా స్నానం చేసి, శివకేశవులను పూజించి, సాయంసమయంలో కోవెలలో దీపారాధన  చేసినచో ....... నీ ప్రవర్తనలో మార్పు వచ్చి,  ప్రజలంతా నిన్ను మెచ్చుకొందురు...... నీవు చేసిన పాపములు తొలగిపోవును" అని చెప్పగా ..... శివశర్మ ఈ విధంగా సమాధానమిచ్చెను " స్నానం చేస్తే మన ఒంటికి ఉన్న మురికి మాత్రమే పోతుంది......పూజలుచేసినంతనే భగవంతుడు ఏమీ ప్రత్యక్షమవ్వడు..... దీపాలు మన ఇంటిలోనే వెలిగించుకోవచ్చును....కోవెలకి వెళ్ళటం ఎందుకు ???"....... ఈ విధమైన సమాధానం కొడుకు నోటివెంట నుండి రావటంతో తండ్రికి కోపంవచ్చి ఈ మాస ఫలమును నువ్వు చులకన చేసినందుకుగాను నువ్వు ఒక కారడవిలో మర్రిచెట్టు తొర్రలో ఎలుకగా జీవించెదవు.....అని శపించెను. వెంటనే కొడుకు తన చేసిన తప్పు తెలుసుకొని,  "నాకు అజ్ఞానంతో కళ్ళు మూసుకోవటం వల్ల  దైవదూషణ చేసితిని, నాకు శాపవిమోచనం ఎప్పుడో తెలియచేయండి ???" అని అడుగగా "నీవు ఎప్పుడు కార్తీకమహాత్మ్యంను వింటావో ...... ఆ రోజే నీకు శాపవిమోచనం" అని సమాధానమిచ్చెను. వెంటనే కొడుకు ఎలుక రూపం దాల్చి అడవిలోకి పోయి మర్రితొర్రలో నివసిస్తూ ఉండెను.

మూషికం ఉన్న మర్రి చెట్టు కావేరీ నదీ తీరంలో ఉండుటవల్ల ..... నదికి స్నానానికి వచ్చేపోయేవారు చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకొంటూ ఉండేవారు...... ఆ విధంగా కొంతకాలానికి కార్తీకమాసం వచ్చింది .....విశ్వామిత్రుడు తన శిష్యులతో కావేరీ నది స్నానంచేసి వచ్చి.... మర్రి చెట్టు క్రింద కూర్చొని శిష్యులకు కార్తీకపురాణం వినిపిస్తుండగా ......ఒక కిరాతకుడు వారివద్ద ధనాన్ని దోచుకోవటం కోసం వచ్చి, వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది. వారితోపాటు కథని వింటూ అక్కడే ఉండిపోయాడు. తోర్రలోనున్న ఎలుక బాటసారుల వద్ద ఉన్న ఆహారాన్ని తినుటకు బయటకు వచ్చి..... వారు వింటున్న పురాణాన్ని తాను విన్నది......కార్తీకమాస మహాత్మ్యం సమాప్తమయ్యేసరికి కిరాతకునకు తన మునుపటి జన్మ జ్ఞప్తికి వచ్చి, విశ్వామిత్రునకు నమస్కరించి అతని పల్లెకు వెళ్ళిపోయెను..... కలుగు మొదట్లో ఉండి కథ విన్న ఎలుక(శివశర్మ)కు కూడా శాపవిమోచనం కలిగి బ్రాహ్మణరూపం పొంది " మునీశ్వరా ! మీ దయవల్ల మా తండ్రిగారు నాకు ఇచ్చిన  శాపము తొలగింది" అని తన వృత్తాంతము తెలియచేసి ఇంటికి పయనమయ్యెను.

మనకు ఇహపరములలో సిరిసంపదలతో తులతూగుటకు .......మోక్షమును పొందుటకు తప్పనిసరిగా కార్తీకమాస మహాత్మ్యమును చదివి ...... ఇతరులకు వినిపించుట చాలా మంచిది.

-:ఐదవరోజు పారాయణము సమాప్తము:-


                          

No comments:

Post a Comment