November 9, 2013

కార్తీకమాస మహాత్మ్యం ----- ఆరవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం ----- ఆరవరోజు కథ

కార్తీకమాసం నెలరోజులూ శివకేశవులకి పంచామృత అభిషేకాలు చేయించి, కస్తూరి కలిపిన గంధముతో భక్తిగా పూజించినవారికి అశ్వమేథయాగం చేసినంత పుణ్యం దక్కుతుంది. ఎవరైతే ఈ మాసమంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో వారు పరమపదానికి చేరుకుంటారు. వరిపిండితో కానీ, గోధుమపిండితో కానీ ప్రమిద చేసి,  ప్రత్తి తీసుకొని వారే స్వయంగా వత్తులు చేసి, ఆవునేయ్యితో దీపారాధన చేసి, శక్తి కొలది దక్షిణ ఉంచి, ఆ దీపాన్ని ఒక బ్రాహ్మణునికి దానము ఈయవలెను. చివరి రోజు వెండితో చేసిన ప్రమిదలో బంగారము వత్తు వేసి, అవునేయ్యితో దీపం వెలిగించి, వరిపిండి... లేదా గోధుమపిండితో దేపం వెలిగించి బ్రాహ్మణునికి దానమీయవలెను...... ఈ విధంగా చేసినవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షం పొందెదరు.

శ్లోll సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంప త్పుఖావహం 
     దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ ll

ఈ శ్లోకం చదువుతూ దీపదానం చేయాలి..... "అన్నివిధాలా జ్ఞానం కలిగించేది, సకల సంపదలు ఇచ్చే ఈ దీపాన్ని దానం చేస్తున్నాను, నాకు శాంతి కలిగించు".... అని అర్ధము.  

లుబ్ది వితంతువు సర్గమునకు వెళ్ళుట 

ద్రవిడ దేశంలో ఒకానొక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు వివాహం జరిగిన కొద్ది రోజులకే భర్త కాలం చేసాడు. ఆమెకు బంధువులు .....పిల్లలు ఎవ్వరూ లేక ఒంటరిగా ఉండి, అందరి ఇండ్లలో పాచిపని చేసుకుంటూ కాలం గడిపేది. వారు ఏవైనా వస్తువులు ఇస్తే ఎక్కువ ధరకు ఇతరులకు ఇస్తూ......ఆ వచ్చిన సొమ్మును ఎక్కువ వడ్డీకి తిప్పుతూ ..... సొమ్మును బాగా కూడబెట్టింది. దొంగలు దొంగలించిన వస్తువులను తక్కువ ధరకు కొని .... ఇతరులకు హెచ్చు ధరకు అమ్మేది. ఇంత ధనాన్ని సంపాదించి ..... పూజలు - వ్రతాలు, దానం, ఉపవాసం,  తీర్థయాత్రలు వంటివి ఏమీ చేసేది కాదు. కనీసం బిచ్చగాడికి కూడా దానం చేసేది కాదు.

కొంతకాలానికి ఒక బ్రాహ్మణుడు ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న ప్రజల జీవనవిధానాన్ని విచారిస్తుండగా..... పిసినారి స్త్రీ సంగతి  అతనికి తెలిసి.....ఆమె వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్పసాగెను "మానవ శరీరము శాశ్వతము కాదు. ఈ దేహమును వీడి ప్రాణం పోగానే చర్మం కుళ్ళి దుర్వాసన వస్తుంది.  నీవు ఈ శరీరం శాశ్వతమని భ్రమలో ఉన్నావు.... నీలో అజ్ఞానాన్ని వదిలి కాస్తంత ఆలోచించు. ఎవ్వరికీ దానమివ్వక ..... నీవు తినక ఈ సంపాదనని నీ తదనంతరము ఏమి చేయుదవు..... ఇప్పటికైనా నీవు కనులు తెరచి .... నిజాన్ని గ్రహించు .... దానధర్మాలు చేసి నీవు పుణ్యమును సంపాదించి మోక్షాన్నిపొందు. భగవంతుడిని నిత్యం స్మరించు, కార్తీకమాసమంతా స్నానాలు చేసి, పేదలకు దానాలు చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో నీవు చేసిన పాపాలు తొలగి మోక్షాన్ని పొందెదవు." ..... అనెను.

ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు పరవసురాలై మనసు మార్చుకొని, బ్రాహ్మణుడు చెప్పినవి అన్ని చేసి కార్తీకమాస వ్రతమాచరించి మరణానంతరము మోక్షమును పొందెను. కార్తీకమాస వ్రతమునకు అంత మహిమ ఉన్నది కావున ప్రతీ ఒక్కరూ ఈ మాసమంతా నిష్ఠగా వ్రతమాచరించి మోక్షమును పొందండి.

-:ఆరవరోజు పారాయణం సమాప్తం:-   

                                   

No comments:

Post a Comment