November 19, 2013

కార్తీకమహాత్మ్యం పదిహేనవరోజు కథ

కార్తీకమహాత్మ్యం పదిహేనవరోజు కథ
కార్తీకమాసంలో ఎవరైతే హరిహరుల దేవాలయాల ముందర నాట్యము చేస్తారో, వాళ్ళు శ్రీహరి ముందర నివసులౌతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీకమాస శుక్లపక్ష సాయంకాలాలందు విష్ణువును అర్చించే వారు – స్వర్గనాయకులౌతారు. ఈనెలరోజులూ నియమముగా విష్ణువు లేక శివాలయానికి గాని వెళ్ళి, దైవదర్శనం చేసుకునేవాళ్ళు, సాలోక్యమోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకూ – ఒక్కొక్క అశ్వమేధయజ్ఞ ఫలాన్ని పొందుతారు. ఈమాసంలో అస్సలు ఏ దేవాలయానికి వెళ్లనివారు ఖచ్చితంగా రౌరవాది నరకానికో, కాలసూత్ర నరకానికో పోతారు. కార్తీకశుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతీ సత్కర్మా అక్షయ పుణ్యాన్ని......... ప్రతీ దుష్కర్మా అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్లాద్వాదశి నాడు విప్రసహితుడై , భక్తియుతుడై , గంధపుష్పాక్షత, దీపధూప, భక్ష్య, నివేదనలతో, విష్ణువును పూజించిన వారికి --- పుణ్యానికి మితి అనేది లేదు. శుద్ధ ద్వాదశి నాడు శివ – విష్ణువు ఆలయాలాలో ఎక్కడైనా గానీ, లక్షదీపాలను వెలిగించి, సమర్పించే వాళ్ళు, దేవతావిమానమెక్కి దేవతలచే పొగడబడుతూ, విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. ఈనెలరోజులూ దీపము పెట్టలేనివారు ..... శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి --- ఈ మూడు రోజులైనా దీపాన్ని పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేంత సమయమైనా దైవసన్నిధిలో దీపాన్ని వెలిగించేవాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళ పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులుంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని, మళ్ళీ వెలిగించేవాళ్ళు ఘోరమైన పాపాల నుండి తొలగింపబడతారు.
దివ్యపురుషునిగా మారిన ఎలుక
పూర్వకాలంలో సరస్వతీ నదీతీరంలో ఎన్నోఏళ్ళ నుండి పూజలులేక శిధిలమైపోయిన ఒక విష్ణువు ఆలయం ఉండేది. కార్తీకస్నానం కోసం ఆ నదికి వచ్చిన ఒక ముని, ఆ ఆలయాన్ని చూసి, తన తపొధ్యానానికి ఆ ప్రదేశం ఏకాంతంగా ఉంటుందని తలచి, ఆ గుడిని శుభ్రపరచి, దగ్గరలో ఉన్న గ్రమాన్నుంచి నూనె, ప్రత్తి, పన్నెండు ప్రమిదలను తెచ్చి, దీపాలను వెలిగించి  ‘నారాయనార్పణమస్తు’ అని తనలో తానే అనుకొని, ధ్యానము చేసాడు. ఆ ముని ప్రతీరోజూ ఈవిధంగా చేస్తూండగా --- ఒకసారి కార్తీకశుద్ధద్వాదశి రోజున రాత్రి , ఆహారం ఎక్కడా దొరకని, ఆకలితోనున్న ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి, దీపాల దగ్గరకు వచ్చి, ఒక ప్రమిదలో ఆరిపోయిన నూనె వత్తిని ఆహారంగా భావించి, నోట కరచుకొని, ప్రక్కనే వెలుగుతున్న మరోదీపం ఈ వత్తుకు అంటుకొని వెలిగెను. ఆరోజు కార్తీక శుద్ధ ద్వాదశి అగుట, ఆలయంలో ఆరిపోయిన వత్తిని వెలగటం వలన ఆ ఎలుక దివ్యమైన పురుష శరీరాన్ని పొందటం జరిగింది.
ధ్యానంలోనున్న ముని లేచి “ఎవరు నువ్వు? ఇక్కడకు ఎలా వచ్చావు?” అని అడుగగా ...... ఆ అద్భుత పురుషుడు “ఓ మునివర్యా ! నేను ఒక ఎలుకను. నాకీదివ్యతేజం ఎలా వచ్చిందో, పూర్వజన్మలో నేనెవరినో, ఎలుకగా ఎందుకు జన్మించవలసి వచ్చిందో తెలపండి” అని చేతులు జోడించి ప్రార్థించాడు. అంతట ఆ ముని తన మనోనేత్రంతో అతని గతజన్మను దర్శించి , ఈ విధంగా చెప్పసాగెను.
బాహ్లికుని చరిత్ర
“పూర్వం జైమనీగోత్ర సంజాతుడవైన బహ్లికుడనే బ్రాహ్మణుడివి నీవు. సంసార పోషణకై, నిరంతరము స్నానసంధ్యాదులని వదలి, వ్యవసాయమును చేబట్టి, విప్రులను – యోగ్యులను నిందిస్తూ, సంభావనా లాలసతో శ్రాద్ధ భోజనానలను చేస్తూ, నిషిద్ధ రోజులలో రేయింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. అందగత్తెయైన నీభార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయంకోసం, ఒక దాసీని నియమించి, బుద్ధి వక్రించిన వాడివై,  నిత్యం ఆ దాసీని తాకుతూ, మాట్లాడుతూ, నీ పిల్లలు – నీవునూ కూడా ఆమె చేతి భోజనమే చేస్తూ, అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు – పెరుగులు అమ్ముకుంటూ సొమ్మును కూడబెట్టావు. కొంత సొమ్మును తీసుకొని కన్నా కూతురిని కూడా అమ్ముకన్నావు. ఈ విధంగా కూడబెట్టిన సొమ్మును-  ఒక గోతిలో దాచిపెట్టి ..... అర్థాంతరంగా కన్నుమూసావు. ఆ పాపాల కారణంగా నరకాన్ని అనుభవిస్తూ, చివరికి ఎలుకగా జన్మించి, ఈ శిధిలమైన ఆలయంలో బాటసారులు దేవునికి సమర్పించిన వాటిని భుజిస్తూ కాలం గడిపావు. ఈరోజు మహాపుణ్య మైన కార్తీకశుద్ధ ద్వాదశి అవ్వటం వలన, ఆరిపోయిన దీపం నీచేత వెలిగించబడటం వలన, ఇది విష్ణువు సన్నిధి కారణంగా.....నీకు ఎలుక రూపం పోయి –నారా రూపం వచ్చింది.”
ముని చెప్పినది విని – తన గతజన్మ పాపాలకు పశ్చాత్తాపం చెంది, ముని చెప్పినట్టుగా ఆ మరునాటి నుండి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఆ మూడురోజులూ, సరస్వతీ నదిలో ప్రాతః స్నానాన్ని చేస్తూ, ఆ పుణ్య ఫలము వలన వివేకవంతుడై, ప్రతీ సంవత్సరమూ కార్తీక వ్రతాచరణ చేస్తూ, చివరి కాలంలో  సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కావున కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భాగవత్పరాయణుడై – స్నాన, దాన, దీప మొదలైనవి ఆచరించేవారు—విష్ణువుకు ప్రీతిపాత్రుడై సాయుజ్య పదాన్ని పొందుతారు.
-:కార్తీకమహాత్మ్యం పదిహేనవ ప్రయాణం సమాప్తం:-


No comments:

Post a Comment