November 25, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఆరవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఆరవరోజు కథ

ప్రాణభీతుడైన దూర్వాసుడు లోకాలన్నీ సంచరించి, చివరకు విష్ణు లోకాన్ని వైకుంఠమును చేరాడు. "హే బ్రాహ్మణప్రియా ! మాధవా ! మధుసూదనా ! కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శనచక్రం నన్ను చంపడానికై వస్తోంది. బ్రాహ్మణపాదముద్రా సుశోభితుడవైన నువ్వే నన్ను ఈ ఆపద నుండి కాపాడాలి" అని ఘోషిస్తూ శ్రీహరిని శరణు కోరాడు. అంతట విష్ణువు చిరునవ్వు నవ్వుతూ "దూర్వాసా ! ప్రపంచానికి నేను దైవాన్నైనా -- నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు, కానీ నువ్వు సద్భ్రా హ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవూ అయ్యి ఉండీ కూడా అంబరీషుడిని ఆకారణముగా శపించావు. పారణకు వస్తానని చెప్పి, స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు - ఆలస్యముగా రాదలుచుకున్న వాడిని నీ కోసం ఎదురు చూడకుండా, ద్వాదశీఘడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇవ్వలేదు. ద్వాదశి దాటుటకు కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయములో వ్రతభంగానికి భయపడి మంచినీళ్ళను తీసుకున్నాడే తప్ప ఆకలితోనో, నిన్ను అవమానించాలనో కాదు కదా. నిషిద్ధ ఆహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చేబుతూండగా అదేమంత తప్పని నువ్వు శపించావు ??? ఆత్రేయా ! నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ, కోపగించుకోలేదు కదా ??? అయినాసరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవటం కోసం నీ శాపాన్ని నిమిషంలో తిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయింది అనే లోకోపవాదము నీకు కలగకుండా ఉండటం కోసం ఆ భక్తుని హృదయములో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించినవాడినీ, నీ శాపాన్ని అంగీకరిస్తూ "గృహ్ణామి"  అన్నవాడినీ నేనేగానీ, ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవు ఇచ్చిన శాపం సంగతే తెలియదు.

ఋషి ప్రభూ! నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహా మత్స్యంగా అవతరిస్తాను. దేవదానవుల క్షీరసాగర మధనము సమయంలో మందరగిరిని మూపున ధరించడానికై కుదురుగా ఉండేందుకుగానూ కూర్మవతారుడు (తాబేలు)ని అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుడిని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం వికృతాకారముగల రూపాన్న అవతరిస్తాను. సర్వదేవతా సంరక్షణ కొరకు ధర్మ బలుడైనా కూడా దానవుడు కనుక 'బలి' అనే వాడిని శిక్షించేందుకు వామనుడను అవుతాను. త్రేతాయుగమున జమదగ్నికి కుమారునిగా జన్మించి,  సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్ళగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైన అంటే నేనే భగవంతుడను అనే దానిని మరచిపోయి మాయామానుష విగ్రహుడైనదశరథ రామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానినీ, బలవంతుడను అయి ఉండీ కూడా, రాజ్యాధికారం లేకుండా (బలరాముడు) కు తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగం ఆరంభమున పాపమోహము కొరకు పాషాండ మత ప్రచారకుడనై బుద్ధునిగా అవతరిస్తాను. ఓ దూర్వాసా ! నా ఈ దశావతారములను -- ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా , చదివినా , తెలుసుకున్నా వారి పాపాలు తొలగిపోతాయి.

ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి దేశ , కాల , వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ఉంది. అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా ఏకాదశినాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాయి. అటువంటి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వు ఆ అంబరీషుణ్ణి శపించింది చాలక, తిరిగి మరో ఘోరశాపమును ఇవ్వబోయావు. బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము - భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడం ఈ రెండూ నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను" అని విష్ణువు పలికెను.

కార్తీకమాసం ఇరవైఆరవరోజు కథ పారాయణం సమాప్తం

                           

No comments:

Post a Comment