November 14, 2013

కార్తీకమాస మహాత్మ్యం -- పదకొండవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం -- పదకొండవరోజు కథ 

శ్రీహరిని అవిసెపూలతో పూజిస్తారో ... వారికి చాంద్రాయణఫలము దక్కుతుంది. గరికతో పూజించినవారు,   చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించినవారు పాపవిముక్తులై వైకుంఠమునకు వెళతారు.కార్తీకస్నానం చేసి, భగవత్సన్నిధిలో దీపారాధన చేసినవారు పురాణ పాఠకులు, శ్రోతలు పరమపదానికి చేరుకుంటారు.

మందరోపాఖ్యానం 

పూర్వం కళింగదేశంలో మంధరుడుఅనే ఒకానొక బ్రాహ్మణుడు పరులవద్ద కూలిపని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సాముద్రికాది శుభలక్షణ సంపన్నా, సద్గుణ సముచ్చయముచేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. అతనియందు అనురాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్యపరురాలై ఉండేది. కొన్నాళ్ళు తరవాత కూలితో జీవించటం కష్టమని భావించిన మంధరుడు అడవులకు పోయి, దారికాచి, బాటసారులను  కొట్టి వారివద్ద నుండి ధనాన్ని దోచుకుంటూ, ఆ ధనాన్ని ఇరుగుపొరుగు దేశాలకు తీసుకువెళ్ళి అమ్మి, కాలం గడుపుతూ ఉండేవాడు.

దొంగతనానికై దారికాచిన మంధరుడు బాటసారైన బ్రాహ్మణుని పట్టుకొని, ఒక మర్రిచెట్టుకు కట్టి, అతనివద్దనున్న సొమ్ముని దోచుకున్నాడు..... ఈలోగా అటుగావచ్చిన ఒక కిరాతకుడు మంధరుడిని...బ్రాహ్మణుని ఇద్దరినీ సంహరించి....వరివద్దనున్న ధన్నాన్ని దోచుకొని పారిపోతుండగా.....నరవాసన వచ్చి...అక్కడకు దగ్గరలో గుహలోనున్న పెద్దపులి గాండ్రించుకుంటూ వచ్చి కిరతకునిపై పంజా విసిరింది...అదే సమయంలో కిరాతకుడు తనవద్దనున్న కత్తితో పులిని పొడిచెను ...ఇద్దరు ఒకే సమయానికి చనిపోయారు. ఈ విధంగా మరణించిన నలుగురూ యమలోకానికి చేరి, అనేక శిక్షలు అనుభవిస్తూ బాధపడుతున్నారు.

భర్త మరణవార్త తెలియని సుశీల మాత్రం ప్రతీరోజూ భర్తనే తలుస్తూ....భాగవత్భక్తితో , సజ్జనసాంగత్యంతో జీవిస్తూ ఉంది. ఒకరోజు ఒక యతీశ్వరుడు సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్షవేసి... "నాభర్త ఇంట్లో లేడు,  అతని నామస్మరణ చేస్తూ  నేను కాలం గడుపుతున్నాను. నాకు మోక్షాన్ని ప్రసాదించండి స్వామీ"  అని వేడుకొనగా "నేవు ఆవేదన పడకు, ఈరోజు కార్తీకపౌర్ణమి, మహాపర్వదినము ఈ రోజు సంధ్యాసమయంలో నీ ఇంట్లో పురాణశ్రవణం ఏర్పాటుచేయు..అందుకుగాను దీపారాధన చాలా ముఖ్యము.. దీపానికి తగినంత నూనె నా వద్ద నున్నది...ప్రత్తి - ప్రమిద నీవు ఏర్పాటు చెయ్యు " అని చెప్పెను.

సుశీల వెంటనే తన ఇంటిని గోమయంతో అలికి , ముగ్గులు పెట్టి శుభ్రపరిచింది. చుట్టుప్రక్కల ఉన్నవారినందరినీ సాయంసమయంలో పురాణశ్రవణముందని ఆహ్వానించింది. ప్రమిదలో రెండు వత్తులను వేసి, యతి ఇచ్చిననూనెతో దీపారాధన చేసింది.అందరి మధ్యలో తానూ కూర్చొని పురాణాన్ని విన్నది. ఆనాటినుండి దైవచింతన క్రమక్రమంగా ఎక్కువై , జ్ఞానియై కొంతకాలమునకు కాలం చేసినది. వెంటనే విష్ణుదూతలు దివ్యవిమానము తెచ్చి , సుశీలను వైకుంఠమునకు తీసుకుపోతుండగా ...దారిమధ్యలో నరకంలో బాధలనుభవిస్తున్న భర్తని చూసి, విమానాన్ని ఆపి ...తన భర్త నరకంలో ఉండుటకు కారణమేమి అని అడుగగా ---"నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా...స్నానసంధ్యాదులు మాని, వేదాచారాలని వదిలి, కూలిచేస్తూ, దొంగగా మారి, దుర్మర్గపు పనులు చేయుటవలన ఈ నరకంలో బాధలు అనుభవిస్తున్నాడు ....కార్తీకమాసంలో నీవు చేసిన పురాణశ్రవణ ఫలితాన్ని నీ భర్తకి - బ్రాహ్మణునికి కొంచెం ధారపోసినట్లయితే ఈ నరకము నుండి విముక్తి పొందుతారు ---- దీపారాధనలో నీవు వేసిన వత్తు-ప్రమిద  యొక్క పుణ్యము దానం చేస్తే కిరాతకునికి - పులికి, ---- విముక్తి లభిస్తుంది" అని తెలియచేయగా,  వెంటనే ఆమె అలాగే ధారపోసింది. ఆ నలుగురు ఆమె వద్దకు వచ్చి నమస్కరించి వైకుంఠమునకు చేరుకున్నారు. కార్తీకమాసంలో పురాణాన్ని చదివినా - వినినా ...దీపారాధన చేసినా వారు తప్పకుండా హరిని (లోకానికి) చేరుకుంటారు .

       -:పదకొండవరోజు పారాయణం సమాప్తం:-   
         
               
  

No comments:

Post a Comment