November 27, 2013

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఎనిమిదవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం - ఇరవై ఎనిమిదవరోజు కథ

"ఓ విష్ణుచక్రమా ! ఆగుము ! ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపటమే ప్రధానము అనుకుంటే ముందుగా నన్ను చంపు. ఈ దూర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకి యుద్ధమే ధర్మము కానీ, యాచన చేయడం ధర్మం కాదు. విష్ణు ఆయుధానివి అయిన నీవు నాకు దైవస్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు. నిన్ను జయించగలిగినది అంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు. అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు. మరికొన్నాళ్ళపాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలచుకుంటే శరణాగతుడైన దూర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో, లేకుంటే నిన్ను ఖచ్చితంగా నేలకూలుస్తాను. అన్ని క్షాత్రధర్మపాలనికై, తనకీ దూర్వాసునికీ మధ్య ధనుర్థారియై నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి, అతని ధర్మనిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది. "అంబరీషా ! నాతో యుద్ధమంటే సంబరము అనుకుంటున్నావా? మహాబల మదమత్తులైన మధుకైటభుల్నీ దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసులనీ అవలీలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరిచూడటానికైనా సమస్త ప్రపంచమూ కంపించిపోతోందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తియైన ఈ దూర్వాసుడు ఇప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడు అంటే అది నా ప్రతాపమే అని మరచిపోకు. ఉభయ తేజోసంపన్నుడై దూర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియ అహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు. నువ్వు నన్నేం చెయ్యగలవు ? క్షేమం కోరుకొనేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలేగానీ, ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణుభక్తుడివి కనుక ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బీరాలకుపోయి వృథాగా ప్రాణాలను పోగొట్టుకోకు. 

ఈ మాటలతో అంబరీషుని కనులు ఎరుపెక్కాయి.'ఏమిటి సుదర్శనా ! అలా మాట్లాడుతున్నావు ? నా దైవమైన హరి ఆయుధానివి అని ఇంతవరకూ ఉపేక్షించానుగానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో వేల ముక్కలు చేసి ఉండేవాడిని. దేవ బ్రాహ్మణులపైనా, స్త్రీలూ , శిశువుల పైనా, గోవులపైనా బాణ ప్రయోగం చెయ్యను. నీవు దేవతవైన కారణంగా నీకింకా నా కౄర నారాచఘాతాల రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి (క్షాత్ర) ధర్మయుతంగా పురుషరూపుడివై యుద్దమును చెయ్యు" అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏక కాలంలో ఇరవై బాణాలను వేశాడు. అతని పౌరుషానికీ, ధర్మరక్షణా దీక్షలో దైవనికైనా జంకని క్షాత్రానికీ సంతోషించిన సుదర్శనచక్రం సంతోషించి దరహాసము చేస్తూ "రాజా ! శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకు అలా ప్రసంగించానేగానీ విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దూర్వాసుడిని వదిలివేస్తున్నాను అని చెప్పి, అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై "సుదర్శనా ! నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ, రాక్షసులను సంహరించటంలోనూ, విష్ణుతుల్య ప్రకాశమానమూ  ప్రాణప్రయాణ కష్టహరణశీలము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారములు " అంటూ సాష్టాంగనమస్కారం చేశాడు. అందుకు సంతోషించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి, అభినందించి, దీవించి, అదృశ్యుడు అయ్యాడు. కలియుగ కార్తీకంలో ఈ అధ్యయనాన్ని ఒక్కసారైనా చదివినా, విన్నా అనేక భోగాలను అనుభవించి, జీవిత అంత్య దశలో ఉత్తమగతులను పొందుతారు అని తెలియచేయటంలో ఎటువంటి సందేహమూ లేదు.   

కార్తీకమాసం ఇరవై ఎనిమిదవరోజు కథ పారాయణం సమాప్తం              

                                     

No comments:

Post a Comment