November 5, 2013

కార్తీకమాస మహత్యం---- రెండవరోజు కథ



కార్తీకమాసం రెండవరోజు కథ

వశిష్ఠ మహాముని జనకునితో ఈ విధంగా  చెబుతున్నాడు. "ఓ రాజా ! ఇంతవరకు నీకు కార్తీకమాసము నందు ఆచరించవలసిన విధానము మాత్రమే తెలియచేసాను. ఈ మాసంలో సోమవార వ్రతానికి ప్రత్యెక స్థానం కలదు. ఈ వ్రత విధానం, దాని మహత్యం గురించి ఇప్పుడు వివరిస్తాను

కార్తీక సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ-పురుషులు ఎవరైనా, ఏ జాతివారైనా కాని రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి, శివునిని భక్తితో పూజించి, శక్తీ కొలది దానధర్మములు చేసి, సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా నిష్టతో ఉండి రాత్రంతా జాగారం చేసి, పురాణాది కధలు చదివి, తెల్లారాక నదీ స్నానం చేసి, శక్తీ కొలది పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు అయినా తృప్తిగా భోజనం పెట్టి, మనము భుజించాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరిస్తే పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేరుస్తాడు. వితంతువు సోమవార వ్రతాని చేసి, శివునిని పూజిస్తే కైలాసము, విష్ణువుని పూజిస్తే వైకుంఠం చేరుకుంటారు. ఇందుకు నిదర్శనంగా ఒక కధను తెలియచేస్తాను....

-:కార్తీక సోమవార వ్రత ఫలముచే కుక్క కైలాసమునకు చేరుట:-

పూర్వం కాశ్మీరు దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహితుడు. అతనికి చాలా రోజుల తర్వాత ఒక కుమార్తె కలిగింది. ఆమె యవ్వనవతి అయ్యాక ఒక సద్బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆ యువకుడు నాలుగు వేదాలు, శాస్త్రాలు అభ్యసించాడు. నిత్య సత్య వాది. ఎప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూ ఉండేవాడు. అందువల్ల ప్రజలంతా అతనిని అపరబ్రహ్మ అని అంటూఉండేవారు. అంత ఉత్తమునికి భార్య అయిన ఆమె యవ్వన గర్వముతో, పెద్దలను దూషిస్తూ, అత్తమామలను కొట్టుచూ, వ్యభిచారిణియై, తిరుగుచుండుట వలన, వంశమునకు అప్రతిష్ట తెస్తోందని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ ఆమె భర్త మాత్రము, ఆమె మీద అభిమానము వదలక, ఆమెతో కాపురం చేస్తూ ఉండేవాడు. ఒకరోజున రాత్రి సమయంలో ఆమె భర్త నిదురిస్తున్న సమయంలో, అతని తలపై ఒక బండరాతితో మోది, హతమార్చింది. ఇక తనకి ఏ ఆటంకములూ లేవు అని, ఇంకా విచ్చలవిడిగా, తిరగసాగెను.  

యవ్వన బింకం ఎన్ని రోజులో ఉండదు కదా ! కొంతకాలంలో ఆమె యవ్వనం నశించి, పటుత్వం కృశించి, కురూపియై, భయంకరమైన ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతూ, పురుగులు పట్టి, కొంతకాలానికి మరణించింది. నరకంలో నానా బాధలు అనుభవించి, చివరకు కళింగదేశములో, కుక్కజన్మ ఎత్తి, ఆకలిబాధలు పడలేక, తిరుగుతూ ఉండగా, ప్రజలంతా కొట్టుతూ, తరుముచుండిరి.  ఒకానొక రోజు ఒక బ్రాహ్మణుడు కార్తీకసోమవరవ్రతమును చేసి, ఉపవాసము ఉండి, సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి, బలిఅన్నమును అరుగుపై ఉంచగా, ఉదయము నుండీ ఎక్కడా ఆహారము దొరకక, ఎంతో ఆకలితో ఉన్న ఆ కుక్క ఆవురావురుమంటూ ఆ బలి అన్నమును తినెను. ఆ రోజు అంతా ఉపవాసంతో ఉండుటవలన శివపూజ చేసిన ఇంట వ్రత ప్రసాదము తినుటవలన, ఆ శునకమునకు గతజన్మ స్మృతికి వచ్చుట వల్ల, ఆ ఇంటి బ్రాహ్మణుడుని పిలిచి ఈ విధంగా చెప్పింది. "ఓ మహానుభావా! నా ఈ జన్మకు పదిహేను జన్మల క్రితం నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, సద్బ్రాహ్మణుని పెండ్లాడి, వ్యభిచారిణియై, ప్రేమగా చూసిన భర్తనే హతమార్చి,ముసలితనంలో అనేక రోగాలపాలై, మరణించి, నేను చేసిన పాపములకు నరకంలో అనేక నరకయాతనలు పడి, మా పూర్వీకుల పుణ్యమా అని ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈ దినమున మీరు చేసిన కార్తీకసోమవార వ్రత చేసి, బలిగా వేసిన అన్నమును భుజించుట వలన, నాకు ఈ విధంగా జ్ఞానోదయం కలిగింది. "ఓ బ్రాహ్మణోత్తమా ! మీరు చేసిన కార్తీకసోమవారవ్రత ఫలమొకటి నాకు ఇచ్చి, ఉపకారము చేసి, దయచేసి నాకు మోక్షాని ప్రసాదించండి." ఆమె ప్రార్థన విన్న బ్రాహ్మణుడు, అతను చేసిన ఒక సోమవార వ్రత ఫలమును ఆమెకు ధారపోయగా, ఆమెకు మోక్షమును పొంది, ఒక పుష్పకవిమానము వచ్చి, అందరూ చూస్తూండగా ఆమెను శివసాన్నిధ్యమునకు తీసుకువెళ్ళెను.  

                        

No comments:

Post a Comment