November 6, 2013

కార్తీకమాస మహాత్మ్యం -- మూడవరోజు కథ

కార్తీకమాస మహాత్మ్యం -- మూడవరోజు కథ 

కార్తీకమాసంలో స్నానమాచారించుట వలన కలిగే లాభనష్టములు:

"కార్తీకమాసమున ఏ చిన్నదానము చేసిన, సకలైశ్వర్యములు కలగటమే కాకుండా,  చనిపోయిన తరవాత శివుని సాన్నిధ్యము చేరుకుంటారు. కొందరు భోగభాగ్యములకు అలవాటుపడి, కార్తీక స్నానాలు చేయకుండా, అవినీతి పనులు చేస్తూ, మరణించిన అనంతరము... క్షుద్రజన్మలు(కుక్క , పిల్లి వంటి జంతు జన్మలు) పొందుతారు. మాసమంతా స్నానాదులు చేయలేని వారు, కార్తీకమాస శుక్లపౌర్ణమి రోజు అయినా శుచిగా స్నానమాచరించి, జపతపములు ఐనా చేయవలెను. అలాకూడా చేయలేని వారు మరుజన్మలో అనేక చెండాలమైన జన్మలు ఎత్తి, చివరకు బ్రహ్మరాక్షసులుగా జన్మిస్తారు. ఇందుకు నిదర్శనంగా ఒక కథ ఉంది....శ్రద్ధగా ఆలకించు రాజా!"  అని వశిషుడు తెలిపెను.

బ్రహ్మరాక్షసులకు మోక్షం అభించుట:

ఒకానొక గ్రామములో తపశ్శక్తి సంపన్నుడు, సత్యవాక్య పరాయణుడు ఐన ఒక బ్రాహ్మణుడు ఉండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ,  గోదావరీ నదీతీరమును చేరి, వారి పితృదేవతలకి పిండప్రదానము చేయుటకు నది ఒడ్డునకు వెళ్ళుచుండెను.ఆ నది ఒడ్డున ఒక మర్రివృక్షం పైన, భయంకరమైన ముఖము...చింపిరి జుట్టుతో...పెద్దపెద్ద కోరలతో...నల్లని దేహంతో....పెద్ద పొట్టతో మొత్తంగా చూస్తే చాలా భయంకరమైన ఆకారంతో, ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తున్నారు. వారు మువ్వురూ ఆ దారిన వచ్చేపోయే  వారిని భయపెట్టి, బెదిరించి, చంపి, వారిని ఆహారముగా ఆరగించేవారు. ఒడ్డుకు చేరుకున్న బ్రాహ్మణుడిని చూసి ఆ ముగ్గురు రాక్షసులు చెట్టు దిగి, అతనిని చంపే ప్రయత్నం చేస్తుండగా, ఆ విప్రుడు భయపడి, అతనిని ఆదుకొమ్మని, నారాయణ మంత్రాన్ని ఈ విధంగా స్తుతించెను " ఆర్తత్రాణ పరాయణా ! ఆపదలోనున్న గజేంద్రుని ఎలా రక్షింతివో, ద్రౌపతి మానప్రాణములు ఎలా కాపాడిటివో, ప్రహ్లాదుని ఏ విధంగా ఆదుకున్నావో,  ఈ బ్రహ్మరాక్షసుల బారి నుండి నన్ను కూడా అదే విధంగా కాపాడువయ్యా !!!"  అని వేడుకొనగా , అతని నోటివెంట వచ్చిన నారాయణ మంత్రం ఫలితంగా రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, "ఓయీ  మహానుభావా ! మీ నోటివెంట ఉచ్ఛరించిన మంత్ర ఫలితంగా మా ముగ్గురికీ జ్ఞానోదయం కలిగినది. మమ్మల్ని కాపాడండి" అని ప్రార్థించిరి. వారి మాటలకు బ్రాహ్మణునకు కొంచెం ఆశ్చర్యం...ఆనందం కలిగి....." ఇంతకీ మీ ముగ్గురూ ఎవ్వరు ? మీకు ఈ రాక్షస దేహాలు ఎందుకు వచ్చాయి ? వివరించండి " అని అడుగగా.......అంతట ఆ రాక్షసులు "o బ్రాహ్మణోత్తమా ! మీరు పూజ్యులు, మీ దర్శనభాగ్యం అయ్యిన వెనువెంటనే మాకు కొంతవరకు జ్ఞానోదయం కలిగినది. ఇక నుండి మేము మీకు ఏ విధమైన హాని కలుగచేయము."  అని చెప్పిరి. ఆ రాక్షసులలో ఒకడు తన జన్మవృత్తాంతమును ఈ విధంగా తెలియచేసేను.

"నేను ద్రావిడదేశంలో ఒక బ్రాహ్మణ వంశంలో మహాపండిటుతుడిని అనే గర్వంతో, బాటసారులను, అమాయకపు ప్రజలను దౌర్జన్యముగా దోచుకోనుచు దురలవాట్లకు లోబడి, భార్యాబిడ్డలను సుఖపెట్టక, పండితులైనవారిని అవమానపరుస్తూ, అందరికి కంటకమువలెప్రవర్తించుచుండెడి వాడిని.

ఒకరోజు ఒక పండితుడు కార్తీకమాస వ్రతమును చేసి, బ్రాహ్మణులకు అన్నదానము చేయ సంకల్పించి, పదార్థాలు కొనుటకై కొంత సొమ్మును తీసుకొని, వస్తువులు కొని తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చిన అతనిని బాగా దూషించి, కొట్టి, అతనివద్ద నున్న ధనాన్ని...వస్తువులను లాగుకొని, ఇంటి నుండి బయటకు గెంటివేసాను. వెంటనే కోపోద్రిక్తుడైన ఆ విప్రుడు "నీచుడా ! అన్యాయంగా సంపాదించిన సొమ్ము చాలక, సాటి బ్రాహ్మణుడనుఅని కూడా చూడక, నన్ను కొట్టి, తిట్టి, నావద్దనున్న సొమ్మును, వస్తువులను దోచుకున్నావు. నీవు చేసిన ఈ పాపకృత్యములకు ఫలితంగా రాక్షసుడివై, మనుష్యులను భక్షిస్తూ, జనసంచారము లేని ప్రదేశంలో నివశించుగాక " అని శపించాడు. బ్రహ్మాస్త్రముననైనాతప్పించుకోవచ్చు కానీ ..... సద్బ్రాహ్మణుని శాపం ఎవ్వరూ తప్పించుకోలేరు. వెంటనే ఆ బ్రాహ్మణుని శాపవిమోచనము కోరగా ......."గోదావరీ నదీ తీరంలో నివశించే నీకు ఏ సద్బ్రాహ్మణుడు నిష్టగా కార్తీకసోమవార వ్రతమును ఆచరించి, పుణ్యఫలమును సంపాదించునో అతని వలన నీ శాపవిమోచనము కలుగును" అని తెలిపి వెళ్ళిపోయెను. ఆనాటి నుండి నేను ఈ భయంకర రూపంతో ఇలాగే బ్రతుకుతున్నాను. నన్ను కరుణించి నా కుటుంబమును రక్షించండి" అని తన వృత్తాంతాన్ని తెలిపాడు.

ఇక రెండవ రాక్షసుడు తన జన్మవృత్తాంత్తాన్ని ఇలా తెలియచేసాడు--- నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడిని. చెడ్డవారితో స్నేహంచేసి....తల్లిదండ్రులకు తిండి పెట్టక, వారి ఎదురుగానే భార్యాబిడ్డలతో అన్నిరకాల పిండివంటలతో ఆహారాన్ని భుజిస్తూ ఉండేవాడిని. బంధువుల ఆస్తులని సాంతం చేసుకునేవాడిని...దానధర్మములు అస్సలు చేయలేదు. ఇన్నిపాపములు చేయుటవలన నాకీ రాక్షసజన్మ వచ్చింది.....నన్ను పాపము నుండి విముక్తుడను చెయ్యండి"...అని తెలిపెను.

మూడవ రాక్షసుడు కూడా తన జన్మవృత్తాంతమును ఈ విధంగా తెలియచేసాడు---" నేను ఒక ఉన్నత బ్రాహ్మణకుటుంబములో జన్మించాను...వైష్ణవాలయంలో అర్చకునిగా ఉండీ కూడా....స్నానము చేయకుండా...కట్టుబట్టలతో (పాచిబత్తలతో) దేవాలయంలో తిరుగాడుచూ, భగవంతునికి సమయానికి చెయ్యవలసిన అర్చనలు, నైవేద్యములు  చెయ్యక, భక్తులు ఇచ్చే తాంబూలంలో దక్షిణలను లాగుకొని.....ఇంటికి ఇవ్వక నా ఉంపుడుగత్తెకు ఇస్తూ....మద్యాన్ని సేవిస్తూ....ఎన్నో పాప, నీచ కార్యాలు చేసినందువల్ల మరుజన్మలో ఇలాగ రాక్షసజన్మ ఎత్తవలసి వచ్చింది. నన్ను ఈ పాపజన్మ నుండి నన్ను విముక్తుడిని చెయ్యండి" అని తెలియచేసాడు.

ఆ ముగ్గురి రాక్షసుల దీనగాథలు విన్న బ్రాహ్మణుడు "ఓ బ్రహ్మరాక్షసులారా ! మీరు గతజన్మలో చేసిన పాప కార్యముల ఫలితంగా మీరు ఈ రూపంలో ఉన్నారు.....మీకు తప్పక విముక్తిని కలిగించేడను నాతో రండి" అని చెప్పి గోదావరిలో స్నానము చేసి...ఆ స్నాన ఫలమును వారి ముగ్గురికి సంకల్పం చెప్పి ధారపోయగా.....వారికి రాక్షసరూపం పోయి.....దివ్యరూపాలు వచ్చాయి....వెంటనే వారు బ్రాహ్మణునికి నమస్కరించి, వైకుంఠమునకు వెళ్ళిపోయారు. కార్తీకమాసంలో ఒక్క దినమునైనా పుణ్యనదులలో స్నానమాచరిస్తే హరిహరులు తృప్తిపడి....వారికి సకల ఐశ్వర్యాలు ఇస్తారు.

-:మూడవరోజు పారాయణ సమాప్తం:- 

                   

                                                       


No comments:

Post a Comment