June 27, 2013

శ్రీ కృష్ణ శతకం 11 నుండి 20 వరకు పద్యములు

శ్రీ కృష్ణ శతకం 11 నుండి 20 వరకు పద్యములు 

11 వ పద్యం 
పదునాలుగు భువనంబులు
కుదురుగ నీకుక్షి నిలుపుకొను నేర్పరివై
విదితంబుగ నా దేవకి
యుదరములో నెట్టు లొదిగియుంటివి కృష్ణా.

భావం:--
కృష్ణా ! పదునాలుగు లోకములు నీ ఉదరములో గల వాడవు. నీ తల్లియగు దేవకీ దేవి కడుపులో ఎట్లు అణగియుంటివో ! చాలా చిత్రము నీ లీలలు.

12 వ పద్యం 
అష్టమి రోహిణి ప్రొద్దున
నష్టమగర్భమున బుట్టి యా దేవకికిన్
దుష్టుని కంసు వధింపవె
సృష్టి ప్రతిపాలనంబు సేయగ కృష్ణా.

భావం:--
లోకమును ధర్మయుక్తముగా పాలించుటకు దేవకీ దేవికి ఎనిమిదవ బిడ్డవై పుట్టి, దుర్మార్గుడగు కంసుని చంపితివి కదా ! ఓ కృష్ణా నీ క్రియలు ధర్మాత్మకములు ప్రపంచమును రక్షించునవికదా.

13 వ పద్యం 
అల్ల జగన్నాథుకు వ్రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్ల సతి యా యశోదము
తల్లి యునై చన్నుఁగుడిపె దనరగ కృష్ణా.

భావం:--
కృష్ణా ! జగన్నాధుడవైన నీకు వ్రేపల్లె ఆటస్థలమయ్యెను. గొల్లసతియగు యశోద తల్లియై పాలిచ్చెను. వ్రేపల్లె ధన్యమయ్యెను. యశోద ధన్యురాలయ్యెను.

14 వ పద్యం 
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా.

భావం:--
కృష్ణా ! నందుని భార్యయగు యశోద కాళ్ళ గజ్జెలు, అందెలు మ్రోయగా మిగుల వేడుకతో చిందులు త్రొక్కుచు ఆడెదవు. ఆమె అదృష్టమే అదృష్టము.

15 వ పద్యం 
హరిచందనంబు మేనున
కరమొప్పెడు హస్తములను కంకణరవముల్
ఉరమున దత్నము మెఱయఁగఁ
బరిగితివౌ నీవు బాలప్రాయము కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు చిన్నతనము నందు శరీరమున శ్రీగంథమును, చేతులయందు కంకణధ్వనులు, వక్షమున కౌస్తుభమణియు, మెరయగా అందముగా అగుపించితివి కదా... 

16 వ పద్యం 
పాణితలంబున వెన్నయు
వేణీమూలబునందు వెలయఁపింఛం
బాణిముత్యము ముక్కున
నాణెముగా దాల్చు లోకనాథుఁడ కృష్ణా.

భావం:--
కృష్ణా ! చేతిలో వెన్నముద్దయు, శిరస్సుపై నెమలి పింఛము, ముక్కునందు ముత్తెమును నేర్పుగా ధరించి, లోకమును మోహింపజేసిన శేషశాయివి నీవే కదా .... 

17 వ పద్యం 
మడుగుకు జని కాశియుని
పడగలపై భతరశాస్త్ర పద్దతి వెలయన్
గడు వేడుకతో నాడెడు
నడుగులు నా మదిని దలcతు నచ్యుత కృష్ణా.

భావం:--
కృష్ణా ! అచ్యుతా ! కాళీయుని మడుగుజొచ్చి, కాళీయుని పడగలపై భరతశాస్త్ర పద్ధతిగా, నాట్యమాడిన నీ పాదములను నామదిలో నిరతము ధ్యానింతును. 

18 వ పద్యం 
బృందావనమున బ్రహ్మ
నందార్భకమూర్తి వేణునాదము నీ వా
మందార మూలమున గో
విందాపూరింతువౌర వేడుక కృష్ణా.

భావం:--
కృష్ణా ! బృందావనమందు ఆనందమును గూర్చు బాలుని ఆకారముతో మందార వృక్షమూలమున విలాసముగా వేణువును మ్రోగించుచుందువు కదా. 

19 వ పద్యం 
వారిజనేత్రలు యమునా
వారిని జలకంబులాడవచ్చిన నీవా
చీరలుమ్రుచ్చిలియిచ్చితి
నేరుపురా యదియు నీకు నీతియె కృష్ణా.

భావం:--
గోపికలు యమునా నదిలో స్నానము చేయుటకు రాగా, వారి చీరలను నేర్పుగా దొంగిలించి, తెచ్చితివి. ఇట్లు చేయుట నీనేర్పు వెల్లడియగుటకా ! అటుల చేయుట నీకు తగునటయ్యా ???

20 వ పద్యం 
దేవేంద్రుcడలుకరోడను
వావిరిగా ఱాళ్ళవాన వడిగుఱియింపన్
గోవర్థనగిరి యెత్తితి
గోవుల గోపకుల గాచుకొఱకై కృష్ణా.

భావం:--
కృష్ణా !పూర్వము ఇంద్రుడు కోపముచే గోకులముపై రాళ్ళవాన కురిపించెను. నీవు గోవర్ధనపర్వతమెత్తి అచటి వారిని కాపాడితివి కనుక, మిక్కిలి పరోపకార పరాయణుడవు కదయ్యా !

No comments:

Post a Comment