June 27, 2013

శ్రీ కృష్ణ శతకం 31 నుండి 40 వరకు పద్యములు

శ్రీ కృష్ణ శతకం 31 నుండి 40 వరకు పద్యములు 

31 వ శ్లోకం                                                           
దుర్భరబాణము రాగా
గర్భములోనుండి "యభవ !గావు" మటన్నన్
నిర్భరకృప రక్షించితి
వర్భకు నభిమన్యుసుతుని నచ్యుత కృష్ణా.                                

భావం:--
కృష్ణా ! వచ్చిన బాణమునకు భీతిల్లి ఉత్తర గర్భమందు ఉండి "కృష్ణా కావు" మనివేడి అభిమన్యుని కుమారుడగు పరీక్షిత్తుని కాపాడితివి. నీవు ఆర్తత్రాణపరాయణుడవు కదయ్యా మాధవా !
32 వ శ్లోకం 
గిరులందు మేతివౌదువు
సురలందున నింద్రుడౌదువు చుక్కలలోనన్
బరమాత్మ చంద్రుడౌదువు
నరులందున నృపతి వౌదు నయముగ కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు గిరులలో మేరువువు, దేవతలలో ఇంద్రుడవు, చుక్కలలో చంద్రుడవు, నరులలో రాజువు, అయినవాడవు కావున నీవు అన్నిటి యందును అధికుడవయ్యా . 

33 వ శ్లోకం 
చుక్కల నెన్నగ వచ్చును
గ్రక్కున భూరేణువులను గణుతింప నగున్
జొక్కపు నీ గుణ జాలము
నక్కజమగు లెక్కపెట్ట నజునకు కృష్ణా.

భావం:--
కృష్ణా ! చుక్కలను, భూరేణువులను లెక్కించవచ్చును. కానీ బ్రహ్మకైనను నీ గుణములు లెక్కింప సాధ్యము కాదు కదయ్యా !

34 వ శ్లోకం 
కుక్షిని నఖిల జగంబులు
నిక్షేపము జేసి ప్రళయ నీరధి నడుమన్
రక్షక ! వటపత్రముపై
దక్షత పవళించునట్టి ధన్యుడ కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీ ఉదరములో జగములను దాచి, ప్రళయకాలమందు వటపత్రముపై పవళించియుందువు కదా ! వటపత్రశాయి అన్న కీర్తిశాలివి కదయ్యా నీవు.
35 వ శ్లోకం 
విశ్వోత్పత్తికి బ్రహ్మవు
విశ్వము రక్షింపదలచి విష్ణుడ వనగా
విశ్వము జెరుపను హరుడవు
విశ్వాత్మక ! నీవె యగుచు వెలయగ కృష్ణా.

భావం:--
కృష్ణా ! సృష్టింప -- బ్రహ్మవు, పెంచ -- విష్ణుడవు, నశింప(త్రుంప) -- శివుడవుగా వెలసిన 
త్రిమూర్తిస్వరూపుడవు నీవే కదయ్యా !

36 వ శ్లోకం 
అగణిత వైభవ ! కేశవ !
నగధర ! వనమాలి ! యాదినారాయణ !యో
భగవంతుడ ! శ్రీమంతుడ !
జగదీశ్వర ! శరణు నీకు శరణము కృష్ణా.

భావం:--
శ్రీకృష్ణా ! ఎక్కువ వైభవం కలవాడా ! కేశవా ! నగధర ! వనమాలీ ! ఆదినారాయణా ! భగవంతుడా ! శ్రీమంతుడా ! జగదీశ్వరా ! మున్నగు బిరుదములు గల ఓ కృష్ణా ! నిన్ను శరణుజొచ్చితిని, నన్ను కాపాడుము. 

37 వ శ్లోకం 
మగ మీనమవై జలనిధి
పగతుని సోమకుని జంపి పద్మభవునకు
న్నిగమములు దెచ్చి యిచ్చితి
సుగుణాకర! మమ్ము గరుణ జూడుము కృష్ణా.

భావం:--
కృష్ణా ! మత్స్యావతారమెత్తి, సముద్రములో దాగిన సోమకుని చంపి, వేదములు బ్రహ్మకు అందించిన దేవా ! మమ్ము దయతో పాలింపుమయ్యా..... 

38 వ శ్లోకం 
అందఱు సురలును దనుజులు
పొందుగ క్షిరాబ్దిదరువ పొలుపున నీ వా
నందముగ కూర్మ రూపున
మందరగిరి యెత్తితౌర మాధవ కృష్ణా.

భావం:--
కృష్ణా ! దేవాసురులు మందరగిరిని కవ్వముగా చేసి, పాలసముద్రమును చిలికినపుడు, గిరి క్రుంగిపోతుండగా, నీవు కూర్మ రూపుడవై గిరినెత్తి, వారిని బ్రోచితివి కదా ! మమ్ము దయచూడుమయ్యా !

39 వ శ్లోకం 
ఆది వరాహుడవయి నీ
వా దనుజ హిరణ్య నేత్రు హతుజేసి తగన్
మోదమున సురలు పొగడగ
మేదిని కిటి ముట్టికెత్తి మెరసితి కృష్ణా.

భావం:--
కృష్ణా !నీవు ఆదివరాహావతారమెత్తి, హిరణ్యాక్షుని చంపి, భూమిని కోరలపై ఎత్తి, దేవతలు పొగడగా ప్రకాశించితివి కదా !

40 వ శ్లోకం 
కెరలి యఱచేత కంబము
నరుదుగ వేయుటను వెడలి యసురేశ్వరునిన్
ఉరమును జీరి వధించితి
నరహరి రూపావతార నగధర కృష్ణా.

భావం:--
కృష్ణా ! హిరణ్యకశిపుడు స్తంభమును అరచేత తట్టగా, అందుండిన నీవు నరసింహావతారుడవై వెడలి, వాని వక్షము చీల్చి సంహరించితివి కదా !

No comments:

Post a Comment