June 27, 2013

శ్రీ కృష్ణ శతకం 21 నుండి 30 వరకు పద్యములు

శ్రీ కృష్ణ శతకం 21 నుండి 30 వరకు పద్యములు 

21 శ్లోకం:--
అండజవాహన వినుబ్ర
హ్మండంబుల బంతులపట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండిక పనిగాక దొడ్డకొండా కృష్ణా.

భావం:--
కృష్ణా ! బ్రహ్మాండములను బంతులాడినట్లు, ఆడింప సామర్ధ్యముగల నీకు, కొండలను ఎత్తుట తేలికయైన పనియేయగును కదా !

22 శ్లోకం:--
అంసాలంబిత కుండల
కంసాంతక! నీవు ద్వారకపురిలోనన్
సంసారరీతి నుంటివి
హంసేంద్ర! విశాలనేత్ర అచ్యుత కృష్ణా.

భావం:--
కృష్ణా ! భుజములను తాకు కుండలములు కలవాడా ! కంసాది దుష్టులను వధించి, కారణజన్ముడవయి కూడా, ద్వారకానగరిలో మామూలు సంసారివై యుండుట చాలా ఆశ్చర్యము కలిగించితివి. 

23 శ్లోకం:--
పదియాఱువేల నూర్వురు
సుదతులు యెలమండ్రు నీకు సొంపుగ భార్య
ల్విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు పదహారువేల గోపికలతో, ఎనిమిదిమంది భార్యలతో, బహురూపములతో నెడతెగక భోగించుచుందువు గదా ! నిజమైన రాజభోగమన్న నీదే కదయ్యా !

24 శ్లోకం:--
అంగన పనుపున ధోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయనొస్రుcగితివి
రంగుగ సంపదలు లోకరక్షక కృష్ణా.

భావం:--
కృష్ణా ! తన భార్యయైన వామాక్షీ పంపుటచే, కొంగున అటుకలు మూటకట్టుకొని, దారిద్ర్యభారంతో వచ్చిన, నీ స్నేహితుడగు కుచేలునికి అష్టైశ్వర్యములు ఇచ్చితివి కదా ! 

25 శ్లోకం:--
హా వసుదేవ కుమారక
కావుము నా మాన మనుచు కామిని వేడన్
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీ వర! యక్షయ మంటంచు చీరలు కృష్ణా.

భావం:--
కృష్ణా ! కురుసభలో ద్రౌపతి "హా ! వసుదేవనందన! నా మనమును కాపాడుమని, నిన్ను వేడగా, ఆమెకు ఆక్షయముగా వలువలు ఇచ్చి కాపాడితివి కదా ! నీకు ఆశ్రిత వాత్సల్యము మిక్కిలి ఎక్కువ కదా !

26 శ్లోకం:--
శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకష మగుచు మ్రోవ నాహవభూమిన్
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగులజేయు ఘనుcడవు కృష్ణా.

భావం:--
కృష్ణా ! శుభ్రమగు పాంచజన్యమును ఆకాశమంటునట్లు మ్రోగించి, యుద్ధభూమిలో అనుజుల గర్భంబులు భేదింపజేయు ఘనుడవు నీవే కదయ్యా !

27 శ్లోకం:--
జయమును విజయున కియ్యవె
హయముల ములుకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవే తేరున
భయమున తివుసేన విఱిగి పాఱగ కృష్ణా.

భావం:--
హే శ్రీకృష్ణా ! అర్జునునకు రథసారధివై, గుర్రముల కోలనదిలించి వైరిసేనలు, భయమున చెల్లాచెదరై పారిపోవునట్లుచేసి అర్జునునకు జయమును కూర్చితివి కదా !

28 శ్లోకం:--
దుర్జనులగు నృపసంఘము
నిర్జింపగ దలచి నీవు నిఖిలాధారా !
దుర్జనులను వధియింపను
నర్జును రథచోదకుండ వైతివి కృష్ణా ll

భావం:--
కృష్ణా ! నీవు దుర్జనులగు నృపులను జయించుటకు, దుర్మార్గులను వధించుటకును అర్జునునకు రథచోదకుడవైతివి కానీ, ఇతరమునకు కాదు, ఇందువలన నిఖిలాధరుడవు అనదగినతివి.

29 శ్లోకం:--
శక్రసుతు గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్ము జంపగ చను నీ
విక్రమ మేమని పొగడను
నక్రగ్రహ సర్వలోకనాయక కృష్ణా .

భావం:--
కృష్ణా ! అర్జునుని కాపాడుటకు చక్రము చేతబూనిభీష్ముని చంపబోవు నీ పరాక్రమము ఏమని కొనియాడెదను ! నీ పరాక్రమము అద్భుతము కదా !

30 శ్లోకం:--
దివిజేంద్రసుతుని జంపియు
రవిసుతు రక్షించినావు తఘురాముడవై
దివిజేంద్రసుతుని గాంచియు
రవిసుతు బరిమార్చితౌర రణమున కృష్ణా ll

భావం:--
కృష్ణా ! నీవు రామావతారములో ఇంద్ర తనయుడు అగు వాలిని చంపి, సూర్య తనయుడు అగు సుగ్రీవుని కాపాడితివి. కృష్ణావతారమున సూర్య తనయుడగు కర్ణుని బలహీనుడిని చేసి, ఇంద్రతనయుడు అగు అర్జునుని రక్షించితివి. నీ లీలలు అద్భుతాలు కదయ్యా ! 

No comments:

Post a Comment