June 27, 2013

శ్రీ కృష్ణ శతకం 61 నుండి 70 వరకు పద్యములు

61

గజరాజ వరదే కేశవ !
త్రిజగత్కల్యాణమూర్తి దేవ మురారీ !
భుజగేంద్రశయన మాధవ
విజయాప్తుని  నన్ను గావు వేడుక కృష్ణా.

భావం:--
కృష్ణా ! గజరాజును పాలించిన కేశవా ! మూడులోకములందు శుభమైన ఆకారము కలవాడా !మురాసురుని చంపినవాడా ! శేషునిపై పవళించిన వాడా ! మాధవా ! లోకవిషయములలో జయము కల్పించి, నన్ను కాపాడుము.

62

గోపాల ! దొంగ ! మురహర !
పాపాలను పాఱద్రోలు ప్రభుడవు నీవే
గోపాలమూర్తి ! దయతో
నాపాలిట గలిగి బ్రోవు నమ్మితి కృష్ణా.

భావం:--
కృష్ణా ! గోపాలా ! వెన్నదొంగా ! మురాసురుని సంహరించినవాడా ! నా పాపములను పోగొట్టువాడివి నీవేనయ్యా!
నాయందు దయజూపి, నన్ను కాపాడుము.

63

దుర్మతిని మిగుల దుష్టపు
కర్మంబులు జేసినట్టి కష్టుని నన్నున్
నిర్మలుని జేయవలెని
ష్కర్ముడ నిను నమ్మినాను సతతము కృష్ణా.              

భావం:--
కృష్ణా ! చెడుమనస్సు కలవాడను, దుర్మార్గమైన పనులు చేసినట్టి దుష్టుడను, పాపరహితునిగా చేసి పాలిచుమయ్యా ! నిరతము నిన్నే నమ్మియున్నాను కదయ్యా !

64

దుర్వార చక్రకరధర !
శర్వాణీ ప్రముఖ వినుత ! జగదాధారా !
నిర్వాణనాధ ! మాధవ !
సర్వాత్మక నన్నుగావు సరగున కృష్ణా.

భావం:--
కృష్ణా ! వారింపసాధ్యముకాని చక్రము చేతియందు గలవాడా ! పార్వతి మున్నగువానిచే పొగడబడినవాడా !లోకమునకు ఆధారుడైనవాడా ! మోక్షమునకు ప్రభువైనవాడా ! మాధవా ! సర్వాత్మక ! నన్ను కాపాడుము.

65

సుత్రామనుత ! జనార్థన !
సత్రాజిత్తనయనాధ ! సౌందర్యకళా !
చిత్రాపతార ! దేవకి
పుత్రా ! ననుగావు నీకు పుణ్యము కృష్ణా.

భావం:--
కృష్ణా ! ఇంద్రాదివినుతా ! జనార్థన ! సత్యభామా ప్రియా ! దేవకీ తనయా ! నన్ను కాపాడుము, నీకు పుణ్యమగును.

66

బల మెవ్వడు కరి బ్రోవను
బలమెవ్వడు పాండుసుతుల భార్యను గావన్
బలమెవ్వడు రవిసుతునకు
బలమెవ్వడు నాకు నీవె బలమౌ కృష్ణా.

భావం:--
కృష్ణా ! గజేంద్రునకు, ద్రౌపదికి, సుగ్రీవునకు బలమేవ్వరో, అట్టి నీవే నాకును బలము. నన్ను కాపాడుము తండ్రీ.

67

పరుసము సోకిన యినుమును
పరుసగ బంగారమైన వడుపున జిహ్వన్
హరి ! నీ నామము సోకిన
సురపందిత నేను నటుల సులభుడ కృష్ణా.

భావం:--
కృష్ణా ! పరుసవేది సోకిన ఇనుము, బంగారమగునట్లు, మందుడనగు నేనును, నీ నామము ఉచ్చరించిన సన్మార్గుడునిగా అయ్యెదను.

68

ఒకసారి నీదు నామము
ప్రకటముగా దలచువారి పాపము లెల్లన్
వికలములై తొలగుటకును
సకలార్థా ! యజామీళుడు సాక్షియె కృష్ణా.

భావం:--
కృష్ణా ! ఒకసారి నీ నామము స్మరింపగా పాపములు పోవుననుటకు అజామీళుడే సాక్షి గదయ్యా !

69

హరి సర్వంబున గలడని
గరిమను దైత్యుండు బలుక కంబము లోనన్
ఇరవొంద వెడలి చీల్చవె
శరణను ప్రహ్లాదకుండు సాక్షియె కృష్ణా.

భావం:--
కృష్ణా ! నీవు అంతటా కలవని ప్రహ్లాదుడు పలుకగా, స్తంభములోనుండి వచ్చి హిరణ్యకశిపుని చంపితివి. శరణు అనగా వచ్చి కాపాడితివి. అందుకు సాక్షి  ప్రహ్లాదుడే కదయ్యా !

70

భద్రార్చిత పదపద్మసు
భద్రాగ్రజ సర్వలోక పాలక హరి! శ్రీ
భద్రాధిప ! కేశవ ! బల
భద్రానుజ ! నన్ను బ్రోవు భవహర కృష్ణా.

భావం:--
కృష్ణా !  భద్రార్చిత పాదపద్మా ! లోకపాలకా ! భద్రాద్రివాసా ! బలభద్రానుజ ! నా పాపములు పోగొట్టువాడా ! నన్ను రక్షింపుము.



No comments:

Post a Comment