June 23, 2013

వీర్రాజు గారి పద్యములు 41 నుండి 50 వరకు

41 వ పద్యము.

వికసించిన పద్మము గన 
ఆకస్మికముగా మనసు ఆనందమగున్ 
ముకుళించిన మొగ్గను గని 
వికసించదదేమో మనసు వింతగ నుండున్ ll 

42 వ పద్యము.

శుభముకు పూవులు తెత్తుర
శుభమునకును కూడ పూలు సుచి కూర్పునుగా 
సబుబా పతి గోల్పోయిన 
అబలకు పూలీయరేల అతి చోద్యంబే ll 

43 వ పద్యము.

పతిగల సతి నెపుడయినను 
అతి విలువగ జూడనుండు అందరు కూడా 
పతి చెంతలేని పడతికి 
వెతలే ఎవగిదిగన్న వీడక నుండున్ ll

44 వ పద్యము.

మగడున్న మగువ మాటయు 
నెగడును ఏ విధముగాంచ నేరము అయినన్ 
మగనిని విడచిన సతికిన్ 
నగుబాటేయగును నిజమవగదగు సుమ్మీ ! ll 

45 వ పద్యము.

వచ్చెడి ఆపద మనకున్ 
వచ్చెదనని చెప్పిరాదు వచ్చెడి ముందున్ 
వచ్చును సిరి చెప్పకనే 
వచ్చినటులే పోవు తుదకు వగచినగానీ ll

46 వ పద్యము.

దీపంబుండగ నింటిని 
ఆపద వాటిల్లకుండ అతిమెలకువగా 
ఏపని వుంచక చేయుము 
రేపటికేమగునో జెప్పరే ఎవరిపుడున్ ll 

47 వ పద్యము.

తెల్లని పూవులు కొల్లలు 
ఎల్లపుడును జూచుచుండు ఎవరికి వారున్ 
ఎల్లరి మనసులు గాంచిన 
మల్లెలనే కోరుచుండు మక్కువ తోడన్ ll

48 వ పద్యము.

త్రాగుట చెడ్డని తెలిసియు 
త్రాగును కొందరు ఎపుడును ప్రాజ్ఞతలేకన్ 
బాగుపడరు ఎప్పటికిని 
త్రాగుడు అలవడినవారు తథ్యము సుమ్మీ ! ll  

49 వ పద్యము.

చెడు అలవాటులకు మనిషి 
కడు దగ్గరయగును జూడ కాలము తీరనే
విదనాడని సతినైనను 
విడువగ వెనుకాడరేమి వింతయొ సుమ్మా ! ll  

50 వ పద్యము.

అలవాటులకు మనిషియు 
కలకాలము బానిసవక కనినను చాలున్ 
మెలకువ తోడను మెలగిన 
అలవడదే చెడ్డకూడ ఆఖరికయినన్ ll  


No comments:

Post a Comment