June 27, 2013

శ్రీ కృష్ణ శతకం 81 నుండి 90 వరకు పద్యములు .

81 శ్లోకం
చూపుము నీ రూపంబును
పాపపు దుష్కృతములెల్ల పంకజనాభా
పాపము నాకును దయతో
శ్రీపతి నిను నమ్మునాcడ సిద్దము కృష్ణా ll

భావం
కృష్ణా !కమలనాభా ! శ్రీపతీ నీ మంగళాకారమును చూపుము.  నాపాపములను బాపి కాపాడుము. నిజముగా నిన్నే నమ్మినవాడను.

82  శ్లోకం
నీనామము భవహరణము
నీ నామము సర్వసౌఖనివహకరంబు
న్నీ నామ మమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా ll

భావం
ఓ కృష్ణా!నీ నామము ఉచ్చరించిన సంసార దుఃఖములు తొలగిపోవును,నీ నామమే సర్వసౌఖ్యముల నిచ్చును,నీ నానమము అమృతముతో నిండి ఉండును,అట్టి నీ నామమునే నేను ఎల్లపుడు స్మరింతును.

83  శ్లోకం
పరులను నడిగిన జనులకు
కురచసుమీ యిదియటంచు గుఱుతుగ నీవు
న్గురుచcడవై వేడితి మును
ధర బాదత్రయము బలిని తద్దయు కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!పరులను యాచించుట మనుష్యులకు చులకనకు హేతువని గుర్తించుటకు నీవు ఒక గుజ్జు రూపుదాల్చి బలిని మూడఁడుగుల నేలను వేడితివి గదా!

84  శ్లోకం
పాలను వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్
లీలావినోది వైతివి
బాలుcడవా బ్రహ్మగన్న ప్రభుcడవు కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!నీవు పాలు వెన్నలను దొంగలించగా నీ తల్లి కోపించి నిన్ను ఱోటికి గట్ట, నీ వది ఒక లీలావినోదముగా ఎంచితివి.నీవు బ్రహ్మ దేవుని కన్న లోక ప్రభుఁడవు కాని పిల్లవాడవు కాదు.

85  శ్లోకం
రఘునాయక నీ నామము
లఘుపతితో దలcచగలనె లక్ష్మీరమణా
యఘములు బాపుడు దయతో
రఘురాముcడవైన లోకరక్షక కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!జగద్రక్షకా!మనస్పూర్తిగా కాకపోయినను ఒకసారి నీ నామము ఏక్షణములో తలచి ఆ క్షణమునందే పాపములు పోగొట్టుదువు అట్టి దయా మూర్తివి నీవు.లోకరక్షకుడవు,రాముని అవతారమూర్తి.

86  శ్లోకం
అప్పా యిత్తువు దయతో
నప్పాలను నతిరసంబు ననుభవశాలీ
యప్పాలను గనుగొనవే
యప్పానను బ్రోవు వేంకటప్పా కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!నీవు దయతో తినెడి అప్పాలు,అరిసెలు మొదలగు తియ్యని వస్తువుల ఒసంగుదవు,అట్లే నన్ను దయతోఁ జూడుము.నన్నుఁ బ్రోవుము.

87  శ్లోకం
కొంచెపు వాcడని మదిలో
నెంచకుమీ వాసుదేవ గోవిందహరీ
యంచితముగ నీ కరుణకు
గొంచెము నధికంబు గలదె కొంకయు కృష్ణా  ll

భావం
ఓకృష్ణా!వసుదేవకుమారా!గోవిందా!నేను అల్పుఁడనని సందేహించి ఊరకొనకుము.నీ దయ కొంచెమనియు, గొప్పయనియు లేదు, అందరకును సమానమైనది.

88  శ్లోకం
వావిరి నీ భక్తులకుం
గావరమున నెగ్గుసేయు గర్వాంధుల మున్
దేవ వధించుట వింటిని
నీవల్లను భాగ్యమయ్యె నిజముగ కృష్ణా  ll

భావం
కృష్ణా!నీ భక్తులకు హాని చేయువారిని నీవు ఖండిచితివని వింటిని.నీ వలన లోకములకు శుభమయ్యెను.నీవు నిజముగా భక్తపాలకుఁడవు.నీ వల్లనే మాకు భాగ్యము కలిగినది.

89  శ్లోకం
అయ్యా పంచేంద్రియములు
నుయ్యాలల నూచినట్టు లూచగ నేనున్
నీ యాజ్ఞ దలcపనేరను
కుయ్యాలింపుము మహత్మ గుఱుతుగ కృష్ణా  ll

భావం
కృష్ణా!ఇంద్రియములు నా వశము తప్పి స్వేచ్చగా పరుగెత్తినన్నిటునటు లూపగానే నీ ఆజ్ఞను నేను దలఁచనేరకున్నాను,నామొర వినుము.

90  శ్లోకం
కంటికి రెప్పవిధంబున
బంటుగదా యనుచు నన్ను బాయక యెపుడున్
జంటయు నీ వుండుట నే
కంటకమగు పాపములను గడచితి కృష్ణా  ll

భావం
కృష్ణా!నీకు నేను బంటునుగదా,అనుకొనుచు ఎల్లపుడు నన్ను వెంటబీటుకొని పోయి మనము ఇరువురము జంటగా ఉండుటచేతనే పాపములనుంచి బయటపడగలను.అందుచే ఎల్లపుడు కంటికి రెప్పలాగున నన్ను కాపాడుము.

No comments:

Post a Comment