June 27, 2013

శ్రీ కృష్ణ శతకం 71 నుండి 80 వరకు పద్యములు

71 వ శ్లోకం:--

ఎటువలె కరిమొర వింటివి
ఎటువలె ప్రహ్లాదు కభయమిచ్చితి కరుణ
న్నటువలె నను రక్షింపుము
కటకట ! నిను నమ్మినాడ గావుము కృష్ణా.

భావం:--
కృష్ణా ! ప్రహ్లాదుని ఎట్లు రక్షింతివో ! గజేంద్రుని ఎట్లు బ్రోచితివో ! అట్లే దయతో నన్ను కాపాడుము. కష్టములు పడినవాడను , నిన్నే నమ్మినవాడను.

72 వ శ్లోకం:--

తట తట లేటికి జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణు
న్నెటువలె నిపుణుని జేసితి
వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా.

భావం:--
హే కృష్ణా ! అచ్యుత ఘంటాకర్ణుని ఎటుల నేర్పరిగా, బుద్ధిమంతునిగా చేసితివో, నన్ను అటులే రక్షింపుమయ్యా .

73 వ శ్లోకం:--

తురగాధ్వరంబు జేసిన
పురుషులకును వేరు యిలను పుట్టుటయేమో
హరి ! మిము దలచిన వారికి
యరుదా కైవల్య పదవి యచ్యుత కృష్ణా.

భావం:--
కృష్ణా ! అచ్యుత ! అశ్వమేధయాగము చేసినవారికి జనము లేకున్నచో, నిన్ను దలచినవారికి మోక్షమరుదా (కాదు) ముక్తి లభించును.

74 వ శ్లోకం:--

ఓ భవబంధ విమోచన
ఓ భరతాగ్రజ మురారి యో రఘురామా
ఓ భక్త కామధేనువ
ఓ భయహర నన్నుగావు మో హరి కృష్ణా.

భావం:--
కృష్ణా ! భవబంధములు తొలగించువాడా ! భక్తుల కోరికలిచ్చువాడా ! భరతాగ్రజా ! రామా ! నాపాపములు పోగొట్టి నన్ను కాపాడుము.

75 వ శ్లోకం:--

ఏ తండ్రి కనక కశ్యపు
ఘాతకుడై యతని సుతుని కరుణను గాచెన్
బ్రీతి సురకోటి బొగడగ
నా తండ్రీ ? నిన్ను నేను నమ్మితి కృష్ణా.

భావం:--
కృష్ణా ! ఏ తండ్రి దుర్మార్గుడగు హిరణ్యకశిపుని చంపి అతని సుతుడగు ప్రహ్లాదుని దేవతలు పొగడగా కాపాడెనో, ఆ తండ్రినే నా తండ్రిగా నమ్మితిని, నన్ను కాపాడుము.

76 వ శ్లోకం:--

ఓ పుండరీక లోచన
ఓ  పురుషోత్తమ ముకుంద ఓ గోవిందా
ఓ  పురసంహార మిత్రుడ
ఓ  పుణ్యుడ నన్ను బ్రోవుమో హరి కృష్ణా.

భావం:--
కృష్ణా ! పుండరీకలోచనా ! ముకుందా ! గోవిందా ! పురుషోత్తమా ! శంకరమిత్రా ! మున్నగు నామములు కలిగిన హరీ ! నన్ను బ్రోవుమయ్యా .

77 వ శ్లోకం:--

ఏ విభుడు ఘోర రణమున
రావణు వధియించి లంకరాజుగ నిలిపెన్
దీవించి యా విభీషణు
నా విభు నే దలతు మదిని నచ్యుత కృష్ణా.

భావం:--
కృష్ణా ! ఏ ప్రభువు యుద్ధమునందు రావణుని చంపి విభీషణుని లంకకు రాజుగా చేసెనో అట్టి ప్రభువును నేను ధ్యానించెదను.

78 వ శ్లోకం:--

గ్రహభయ దోషము పొందరు
బహు పీడలు చేర వెఱుచు, పాయును నఘముల్
ఇహపర ఫలదాయక ! విను
తహ తహ లెక్కడివి నిన్ను దలచిన కృష్ణా.

భావం:--
నిన్ను తలచినవారికి గ్రహభయములు కలుగవు. బహుపీడలు కలుగవు. పాపములంటవు. ఇహఫలదాయకా ! కష్టములుండవు.

79 వ శ్లోకం:--

గంగ మొదలైన నదులను
మంగళముగ సేయునట్టి మజ్జనమునకున్
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిము దలచు సాటిరావుర కృష్ణా.

భావం:--
కృష్ణా ! గంగా మొదలైన నదులలో స్నానము చేయుటచే కలుగు ఫలితము, నిన్ను దరిచేరి ధ్యానించుటచే కలుగు ఫలితముతో సమానము కాదు.

80 వ శ్లోకం:--

అ  దండకా వనంబున
కోదండము ! దాల్చినట్టి కోమలమూర్తీ !
నా దండ గావ రమ్మీ
వేదండము కాచినట్టి వేల్పువు  కృష్ణా.

భావం:--
కృష్ణా ! దండకాడవిలో కోదండము దాల్చినవాడవు, గజేంద్రుని కాపాడినవాడవు, నా యెడనుండి, నన్ను కాపాడరమ్ము.


No comments:

Post a Comment