June 13, 2013

"సంసార గాధ--సంతాన బాధ" అనే భాగం నుండి 10 పద్యములు.

శ్రీ గుల్లల వీర్రాజు గారి "సూక్తి సుమమాల" అనే నీతి పద్యములు నుండి 
"సంసార గాధ--సంతాన బాధ"  అనే భాగం నుండి  10  పద్యములు.


చాలును ఇద్దరు పిల్లలు 
మేలగు మీకున్ నిజముగ మెలకువ గనినన్ 
కాలము రీతిని గనుగొన 
చాలును సంతతి ఇరువురు చక్కగ నుండున్ ll 1 ll 


హెచ్చుగ సంతతి కలిగిన 
వచ్చెడి రూకలు మిగులక వగచుచు నీవున్ 
కచ్చితముగ రుణమొకచో
తెచ్చియు గడువంగ వలయు తెలుపగ సతమున్ ll 2 ll 


అప్పులు చేయుట మొదలిడి 
ముప్పులు వాటిల్లు నీకు ముందే గనుమా 
అప్పులవారికి తీర్చగ 
ఎప్పటికీ ధనములేక ఎడ్చుటే మిగులున్ ll 3 ll 


పేద కుచేలుని బాధలు 
ఆచరమున దీర్చెననియు అనుటయె సరియా 
ఆదు కొనుటకై కృష్ణుడు 
కాదా ద్వాపర యుగమ్ము కలియుగ మిదియున్ ll 4 ll 


కలిమితో నున్నను నీసతి 
చెలిమిని విడనాడదెపుడు శృంగారమతిన్ 
గలకల లాడగ నిత్యము 
పిలచిన పలుకను నిలచును పెన్నిధియనగా ll 5 ll 


పిల్లలు ఎక్కువ కలిగిన 
ఇల్లును బాగా ఇరుకయి ఇమడదు కనగా 
నల్లరి వారయితే మరి 
ఎల్లరితో తిట్లు తినగ ఎప్పుడు నుండున్ ll 6 ll 


పాలను పట్టగ పిల్లకి 
చాలక ఏడ్చును మరేమి సలుపగ లేకన్ 
వేళకు పట్టగ నేర్వని 
వాళ్ళకు కడుసంతతేల వాదన యేల ll 7 ll 


పతనము కాకను మీరున్ 
సతిపతులొక్కటి యగుచును సంతతి కొరకున్ 
సతమత మవ్వక నిరతము 
అతి మెలకువతో దిరిగిన ఆనందమగున్ ll 8 ll 


ఇద్దరు ముగ్గురు సంతతి 
యొద్దికగా నుండవచ్చు నోహొ యనగా 
పెద్దలు గిరిదాట మనకు 
నిద్దుర కూడను కరువగు నిజమును గనుమా ll 9 ll 


అనుభవ మిదినే చెప్పెద 
వినినను మీకేంతగానో విజయము గలుగు 
ధనమున్నవారు కూడను 
కనుగొంటిని నిజము నేడు కడు విందవగన్ ll 10 ll   
   

No comments:

Post a Comment