December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైనాల్గవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైనాల్గవ పాశురము
అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి 
చ్చెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోట్రి 
పొన్రచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి 
కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి 
కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి 
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి 
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్ 
ఇన్రియామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్. !



భావం:-
ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. 

రావణుడు సీతమ్మను అపహరించుకొనిపోగా ఆ రావణుండు లంకకేగి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణదిశన ఉన్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము. 

శ్రీకృష్ణుడు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం. 

వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపైన ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిపెలరాయి విసిరినట్లుగా వెలగచెట్టుపైకి దూడను విసురునపుడు ముందు - వెనుకలకు పాదములుంచి నిలచిన మీ దివ్యపాదములకు మంగళం. 

ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసెనను కోపముచే రాళ్ళవాన కురియగా గోపాలురకు, గోవులకు బాధకలుగుచుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. 

శత్రువులను సమూలముగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చెడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. 

ఈ ప్రకారముగా నీ వీరే చరిత్రములనే కీర్తించి పరయనెడి వ్రతసాధనము నందగ మేము ఈనాడు వచ్చినారము అనుగ్రహింపుము. 

అవతారిక:-
ఈనాడు గోపికలు 'శయనాగారము నుండి ఇటు నడచివచ్చి సింహాసనమును అధిరోహింపుము.' అనుటతోడనే ఆశ్రిత సులభుడగు శ్రీకృష్ణుడు వారిమాట మీరలేక తన మంచము నుండి దివ్య సింహాసనము వరకు నడచి వచ్చెను. నీలాదేవియు ద్వారభూమి వరకు మంగళాశాసనము చేయుచు అనుసరించినది. గోపికలు నడచి వచ్చుచున్న స్వామిని చూచినారు. స్వామి నీలాదేవితో కూడా వచ్చి, దివ్య సింహాసనమును అధిరోహించిరి. ఒక పాదమును పాదపీఠంపై నుంచి రెండవ పాదమును తొడపైనిడుకొని కూర్చుండిన సన్నివేశమును చూడగానే, శ్రీకృష్ణుని దివ్యపాదముల ఎర్రదనము గోపికల కంటపడినది. తాము కోరిన ప్రకారము నడుచుట చేతనే పాదములు కందినవని గోపికల హృదయము కలతచెందింది. వెలుపలికి వచ్చి సింహాసనమున కూర్చొని మేము వచ్చిన కార్యమును పరిశీలించుమని అర్థించిన గోపికలు 'పఱ' అను వాద్యమును కోరుత మరచి మంగళము పాడుటకు ఉపక్రమించిరి. 

ఈ పాశురమున గోపికలు శ్రీకృష్ణపరమాత్మా వలన తమ కార్యము నెరవేర్ప జూచినవారై, ఆ ప్రభువు నడచివచ్చి ఆశనముపై కూర్చుండగానే ఆ పాదముల ఎర్రదనము చూచి తాము చేసిన అపచారమునకు ఖిన్నులై మంగళము పాదనారంభించిరి.                 


No comments:

Post a Comment