December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైతొమ్మిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైతొమ్మిదవ పాశురము
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్ 
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్ 
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ 
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు 
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా ! 
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో 
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్ 
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్ !



భావం:- 
బాగా తెల్లవారక మునుపే నీవు ఉన్నచోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరుపూవులు వలె సుందరములు రామణీయములైన పాదములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరవాతనే తాను భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను, స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి 'పఱ' ను పుచ్చుకొనిపోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికినీ .... ఏడేడు జన్మలకునూ నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములైన కోరికలు ఏవియూ లేకుండునట్లు చేయుము. 

అవతారిక:-
మార్గశీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతిపై వర్షమునకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము. పెద్దల సంతృప్తికే తాము స్నానవ్రతము ఆచరించుదుము అనియూ, ఆ వ్రతమునకు 'పఱ' అను వాద్యము కావాలెననియు బయలుదేరి శ్రీకృష్ణుని చేరి ఆ 'పఱ' ను ఇచ్చి తమకు ఆ వ్రతమును పూర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను, పరమాన్న భోజనములు చేయింపుము అని శ్రీకృష్ణుని ప్రార్థించిరి. ఈ గోపికలు 'పఱ' అనుచున్నది మామూలు పఱ కాదు. వీరు ఏదో కోరుతున్నారు .... వారే చెప్పుదురు - అని తాను మాటాడక ఊరకుండెను. అంత గోపికలు 'అయ్యో ! మన ఆర్తీ .... తొందర ఇతనికి తెలియుటలేదే అతడే ఉపాయము అని నమ్మినను , అతడే కాపాడునని ఊరక ఉండలేమే ' అని భగవద్విషయ రుచి తొందర పెట్టగా, తమ కోరికను శ్రీకృష్ణునికి తెలిపి నిత్యకైంకర్యమును - ఫలమును నీవే సమకూర్చవలెనని ఈ పాశురమున గోపికలు చెప్పుచున్నారు.       

   

No comments:

Post a Comment