December 15, 2013

కురుక్షేత్రం

కురుక్షేత్రం 

మహాభారత యుద్ధానికి ముందే కురుక్షేత్రం ప్రసిద్ధి చెందిన క్షేత్రమని భగవద్గీత శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. కౌరవులు - పాండవుల పూర్వీకులైన కురురాజులు, ఈ భూమికి తమ తపస్సు త్యాగానిరతితో, ధర్మభూమిగా మలిచారు. ఈ భూమిలోనే కురురాజులు తీవ్ర తపస్సు చేసారు, నాగలి దున్నారు. ఈ పవిత్రభూమి సరస్వతీ, ద్రుసధతి నదులమధ్య ప్రాంతంలో ఉన్నది. ఈ భూమిమీద నైమిశారణ్యం పవిత్ర తీర్థమైతే, మూడు లోకాలకి పవిత్రమైనది కురుక్షేత్రం. భక్తిశ్రద్ధలతో ఈ క్షేత్ర దర్శనం చేసుకుంటే, అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసిన ఫలం దక్కుతుందట.
ఇక్కడే మహాభారత యుద్ధం జరిగింది. ఈ క్షేత్రం కౌరవ-పాండవులకు పూర్వీకులది అగుట వలన, ఇతరులకు హక్కు లేనందువల్ల, ఇరు పక్షాలవారు, కృష్ణుని సలహా మేరకు, ఈ ప్రాంతంలోనే యుద్ధం చేయటానికి ఒప్పుకున్నారు.
మనం ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత అర్జునుని నిమ్మిత్త మాత్రముగా పెట్టుకుని, శ్రీకృష్ణుని ద్వారా చెప్పబడినది. ఇక్కడే అర్జునునికి విశ్వరూపసందర్శనం కలిగినది. ఇక్కడే కృష్ణుని అనుగ్రహం వల్ల, భీష్మ పితామహుని ద్వారా, మనం నిత్యం చదువుకునే... "విష్ణుసహస్రనామం" లభించంది.
సూర్యగ్రహణ సమయంలో, కురుక్షేత్రాన్ని దర్శిస్తే మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు బలరామ, ఉగ్రసేనుల సమేతంగా ద్వారకనుండి, సుర్యగ్రహణ సమయానికి కురుక్షేత్రం వచ్చి, గోకులం నుండి వచ్చిన.... నందమహారాజుని, యశోదని తిరిగి కలుసుకున్నారని..... ప్రచారంలో ఉన్నది. శ్రీరామాచంద్రమూర్తి కుడా సీతాసమేతుడై.... తన తమ్ములతో సహా, పుష్పక విమానంలో వచ్చి సూర్యగ్రహణ సమయంలో సన్నిహిత సరోవరంలో స్నానమాచరించినట్లు చెబుతారు.

మహాభారత యుద్ధం ముగిసాక, కృష్ణుడు ... మునులు, ఋషులు సలహా మేరకు, యుద్దంలో మరణించిన తన బంధుమిత్రులకు, ధర్మరాజుచే పిండప్రధానము.... సన్నిహిత సరోవర తీరాన్న చేసారని చెబుతారు.

పరశురాముడు కురుక్షేత్రంలో 5 సరోవరాలు ఏర్పాటుచేసినట్లు వాడుకలో ఉన్నది. ఇక్కడ చాలా తీర్థాలు & దేవాలయాలు ఉన్నాయి, ఇవన్నీ చూడటానికి మనకు కనీసం ఒక వారం రోజులున్న సరిపోదు. ఈ ప్రాంతం ఢిల్లీ & హరిద్వార్ కి మధ్యనున్నది.


No comments:

Post a Comment