December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ముప్పయవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ముప్పయవ పాశురము
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై 
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి 
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై 
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న 
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే 
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్ 
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్ 
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్ !
శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం....


భావం:-
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మదింపచేసి, లక్ష్మీదేవిని పొంది, మాధవుడైన వానిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణ ఆభరణములు దాల్చినవారును, అగు గోపికలు చేరి, మంగళము పాడి 'పఱ' అను వాద్యమును లోకుల కొరకును, భవద్దాస్యమును తమకొరకు పొందిరి. ఆప్రకారమున అంతనూ లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తమరపూసల మాలను మెడలో ధరించి ఉండు శ్రీభట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశురములతో మాలికగా కూర్చినది. ఎవరు ఈ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో వారు ఆనాడు గోపికలు ఆ కృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి, పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బహు శిరస్సులు కలవాడును, శ్రీవల్లభుడును, చతుర్భుజుడును అగు ఆ శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును. 

అవతారిక:-
గోదాదేవి -- గోపికలు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రతసమాప్తి చేసి, వ్రత ఫలమును తాను కూడా పొందినది. శ్రీకృష్ణసమాగమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీరంగనాథుని భర్తగా పొందినది. శ్రీరంగము నుండి శ్రీరంగనాథుడు వ్రతసమాప్తి సమయమునకు తమ అంతరంగభక్తులను ఆండాళ్ తల్లి ఉన్న శ్రీవిల్లిపుత్తూరునకు పంపి ఆమెను శ్రీరంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను. అంత శ్రీభట్టనాథులు వారి శిష్యులుగా వల్లభరాయలతో సహా శ్రీరంగమునకు ఆండాళ్ తల్లిని తీసుకొని వెళ్ళెను. అచ్చట స్వామి శ్రీరంగనాథుడు అందరి సమక్షమున శ్రీగోదాదేవిని తమతో చేర్చుకొనెను. అందుచేతనే గోదా - శ్రీరంగనాథ కళ్యాణ దినమునకు 'భోగి' అను వ్యవహారము కలిగెను. భోగము అనగా పరమాత్మానుభవమే. దానిని పొందిన దినము అగుటచే భోగి అనుట ఈ పండుగకు సార్థకము. 

ఈ వ్రతము అందరు ఆచరింపదగినది. ఈ వ్రతమును ఆచరింపలేకపోయినను, నిత్యము ఈ ముప్పది పాశురములు తప్పక అభ్యాసము చేయు వారికి కూడా తాను వ్రతము చేసి పొందిన ఫలము లభింపవలెనని గోదాదేవి ఈ పాశురమున ఆశించుచున్నది. 

గోదాదేవి తాను గోపికగానే వ్రతము చేసినది. ఫలము భగవత్ప్రాప్తి. అట్టి భగవానుడే అమ్మవారిని పొందుటకై చేసిన యత్నము పాలసముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. అందుచే మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటే, స్వామియే మనను పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమృతమథన వృత్తాంతము ఇందు కీర్తించుచున్నారు. ఈ ముప్పది పాశురములు పఠించినవారిని ఆనాడు పాలసముద్రమును మథింప చేసి లక్ష్మిని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నించి పొందును. ఈవిధంగా ఈ పాశురమున  ఫలశృతి చెప్పబడినది.      


                 

No comments:

Post a Comment