December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఆరవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఆరవ పాశురము
మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్ 
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్ 
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన 
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే 
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే 
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే 
కోలవిళక్కే, కొడియే, విదానమే 
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్. !



భావం:-
ఆశ్రిత వ్యామోహము కలవాడా ! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావము కలవాడా !అఘటితఘటనా సామర్ధ్యముచే చిన్న మఱ్ఱిఆకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి, నీవద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదను. 

ఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు, పాలవలె తెల్లనైన నీ పాంచజన్యమనెడి శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద 'పఱ' అను వాద్యములు కావలెను. మంగళ గానము చేయు భాగవతులు కావలెను. మంగళ దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృప చేయుము. అని గోపికలు శ్రీకృష్ణుని ఈ పాశురమున ప్రార్థించిరి. 

అవతారిక:-
భగవానుడే ఉపాయము, భగవానుడే ఫలము అని అని విశ్వసించి యుండు ప్రపన్నులు భగవానుని కంటే ఇతరములగు వానిని కాంక్షింపరాదు. మరొక వ్రతములను ఆచరింపరాదు. మార్గశీర్ష స్నాన వ్రతము, వ్రేపల్లెలోని పెద్దల అభిప్రాయమున వర్షార్థమై చేయు వ్రతము. గోపికల అభిప్రాయమున శ్రీకృష్ణ సంశ్లేషమే ఈ మార్గశీర్ష స్నానము. ఉపాయములలోకెల్ల శ్రేష్ఠమగు భగవానుని అనుభవమున అవగాహించుటయే మార్గశీర్షస్నానము. ఈ రెండు విధములుగా చేయు ఈ వ్రతమునకు ఆవశ్యకములగు పరికరములను గోపికలు ఈ పాశురములో కోరుచున్నారు. బాహ్యముగా పెద్దలకై చేయు వ్రతమునకు కావలసిన పరికరములను అంతరంగమున తమ భగవదనుభూతికి కావలసిన సామగ్రిని కోరుచున్నారు.        


No comments:

Post a Comment