December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- పదిహేనవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పదిహేనవ పాశురము
ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో? 
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్ 
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్ 
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ 
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ? 
ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్ 
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క 
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్. !



భావం:-- 
ఈ పాశురంలో ఉన్న గోపికకు , బయట ఉన్న గోపికలకు సంవాదము నిబంధింపబడినది. 
బయట గోపికలు : ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్రించుచున్నావా ! అయ్యో ఏమి ఇది ? 

లోపల గోపిక     : పూర్ణలగు గోపికలారా ! చీకాకు కలుగునట్లు జిల్లుమని పిలువకుడు. నేను ఇప్పుడే వచ్చుచున్నాను. 

 బయట గోపికలు : నీవు చాలా నేర్పుగల దానవు. నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే తెలుసుకున్నాము. 

లోపల గోపిక     : మీరే నేర్పుగలవారలు, పోనిండు, నేనే   కఠినురాలను. 

బయట గోపికలు : నీకు ఈ ప్రత్యేకత ఏమి ?అలా ఏకాంతముగా ఉండేదవేల ? వేగముగా బయటకు రమ్ము. 

లోపల గోపిక     :  అందరు గోపికలు వచ్చిరా ?

బయట గోపికలు : వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము. 

లోపల గోపిక     : సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను ?

బయట గోపికలు : బలిష్టమగు కువలయాపీడనము అను ఏనుగును చంపిన వాడును శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము. 

అవతారిక:-
ఇంతవరకు భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధనాక్రమము వివరింపబడినది. ఇట్టి సాధన చేయుటచే ఏర్పడవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలుగుట. అది పూర్ణముగా తొలగిననాడుగాని ఆచార్య సమాశ్రయణముచే మంత్రము లభించి భగవదనుభవము కలుగనేరదు. ఇట్టి పరిపూర్ణస్థితి యందు ఉన్న గోపిక ఈనాడు మేలుకొలుపబడుచున్నది. 
మొదటి సగము ఒక తిరుప్పావు -- రెండవ సగము వేరొక తిరుప్పావు. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతము, భగవత్భక్తులను ఆశ్రయించుటచే ఆత్మగుణములు పరిపూర్ణముగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమగునత్తి ఆకారము లభించును. ఆ ఆత్మగుణ పరిపూర్తి అనేది ఎట్టిదో ఈ పాశురములో నిరూపించబడినది.   



No comments:

Post a Comment