December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఇరవై రెండవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవై రెండవ పాశురము
అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే 
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్ 
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే 
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో 
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్ 
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్ 
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.



భావం:--
సుందరము విశాలము అగు మహాపృధివి మండలము అంతయు ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరు అనెడి అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు, మేమును అభిమాన భంగమైవచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామరపువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయుము. 

సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకసమున ఉదయించునట్లు ఉండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా ! మేము అనుభవించియే తీరవలెననెడి శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును. 

అవతారిక:-
గోపికలు శ్రీకృష్ణపరమాత్మ వద్దకు చేరి మేల్కొనుమని వెనుక పాశురమున ప్రార్థించినారు. వేరొక గతిలేక నీకే చెందినవారము అని చెప్పినారు. వెనుకటి పాశురమున సూచింపబడిన అనన్య గతి తత్వమునే ఈ పాశురమున వివరించుచున్నారు. అభిమానము రెండు రకాలుగా ఉండును. సర్వము నాది అను అభిమానము మమతాభిమానము. దేహమే నేను , నేను స్వతంత్రుడను అనునది అహంతాభిమానము. వెనుకటి దానిలో శత్రువులు రాజ్యములను వదలి నీ వాకిటికి వచ్చినట్లు వచ్చితిమి - అని చెప్పిరి. తిరిగి రాజ్యము ఇచ్చినను స్వీకరింపుము. అని శత్రువులు నీ వాకిటనే ఉన్నట్లు ఉంటిమి. అని సర్వమునందు మమతాభిమానము వీడిపోయినట్లు చెప్పిరి. భగవానుని ఆశ్రయించునపుడు ఇతర సంబంధమును పూర్తిగా వీడి భగవానునికే చెందినవారము అను భావము పరిపూర్ణముగా ఉండవలెను. గోపికలు కూడా అట్లే ఈ పాశురమున తమ అనన్యార్హత్వమును విజ్ఞాపన చేయుచున్నారు.   


          

No comments:

Post a Comment