December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ఇరవయ్యవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవయ్యవ పాశురము
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు 
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్ 
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు 
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్ 
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్ 
నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్ 
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై 
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్. !



భావం:-- 
ముప్పదిమూడు కోట్ల అమరులకు, వారికింకను ఆపద రాకముందే పోయి, యుద్ధభూమిలో వారికీ ముందు నిలిచి, వారికీ శత్రువుల వలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ ! మేల్కొనుము. ఆర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము కలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికీ భయజ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకొనుము. 

బంగారు కలశములను పోలిన స్తనములను, దొండపండు వాలే ఎఱ్ఱని పెదవులను, సన్నని నడుమును కల ఓ నీలాదేవీ ! మేల్కొనుము. వీచుటకు ఆలవట్టమును(విసనకర్రను) కంచుటద్దమును మాకు ఒసగి నీ వల్లభుడు అగు శ్రీకృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము. 

అవతారిక:-
గోపికలు ఈ పాశురమున, నీలాదేవి - శ్రీకృష్ణులను మేలుకోలుపుచున్నారు. శ్రీకృష్ణ దర్శనం ఆలస్యమును ఓర్వలేక నీలాదేవిని నిస్టూరముగా "నీవు ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటును ఓర్వకుండుట న్యాయము కాదు. ఇది నీ స్వరూపమునకు, స్వభావమునకు తగదు." అని గోపికలు లెమ్మని పలికిరి. 

ఆమె మౌనమును ఓర్వలేక గోపికలు ఆమెను ఆశ్రయించినను కార్యము చేయువాడు అతడే కదా ! అని అని అతని గుణములనే కీర్తించి మేల్కొలిపెదమని కృష్ణునినే మేలికోలుపుచున్నారు. "మాకు ఈనాడు అనుగ్రహించనిచో -- పూర్వము అర్హులైన దేవతలకు సాయపడి, ఆర్జించిన నీకీర్తి అంతయు మాసిపోవును. నీవు నిర్మలుడవు అని, ఆర్జవము కలవాడివి అని లోకులు అనుకొనుచున్నారు. నీవు ఇట్లుండుత తగదు." అని శ్రీకృష్ణుని గుణములను కీర్తించి మేలుకొలుపుతున్నారు. 

స్వామి బలపరాక్రమములను, గుణజాతమును ప్రశంసించినను స్వామి కదలక - మెదలక ఊరకుండుటచే , గోపికలు నీలాదేవి సౌందర్యమును కీర్తించుచున్నారు. ఎన్నో విధములుగా మనలను రక్షించవలెనని స్వామితో చెప్పి చివరకు జగన్మాత అగు లక్ష్మీదేవి తన యవ్వనసౌందర్యమునకు ఆకర్షితుడు అగునట్లు విలాస విభ్రమములు ఒనర్చి, వశపరచుకొని మనలను స్వామి కటాక్షించునట్లు చేయును. అందుకే భక్తులు అమ్మ సౌందర్యమును వర్ణించుచున్నారు. అట్లు వర్ణించుట  తప్పుకాదా ! అని కొందరికి సందేహము కూడా కలుగును. కానీ జీవులను కాపాడునది అమ్మ సౌందర్యమే. ఆ సౌందర్యము లేనిచో... పరమాత్మ మనను రక్షించి ఉండడు. అందుచే గోపికలు కూడా ఈ పాశురమున నీలాదేవి యొక్క వక్షోజ, అధర, మధ్య సౌందర్యములను ప్రశంసించి, లేచి అనుగ్రహించుము అని అర్థించుచున్నారు.    


                                       

No comments:

Post a Comment