October 29, 2022

పురిటి శుద్ధి ఎలా చెయ్యాలి

పురిటి శుద్ధి ఎలా చెయ్యాలి 

పురుడు 10 రోజుల లోపు తల్లి-బిడ్డకి స్నానం చేయించకూడదు. 

పురుడు 10 రోజులు అయ్యాక,  11 వ రోజు ఉదయాన్నే చుట్టుపక్కల ఉండే 10 ఇళ్ళ నుండి 10 బిందెల నీళ్ళు పసుపు కలిపి తీసుకు వస్తారు. పురిటాలుకి స్నానం అయ్యాక ఆ 10 బిందెల పసుపు నీళ్ళు పోస్తే శుధ్ధి అవుతుందని పెద్దలు చెబుతున్నారు. కానీ ఈరోజుల్లో 10 ఇళ్ళవాళ్ళు రాలేరు కాబట్టి 10 చెంబుల నీళ్ళు పోసి శుద్ధి చేస్తున్నారు.  

చంటి బిడ్డకి స్నానం చేయించాక ఒక జల్లెడలో (బియ్యం జల్లెడ) బిడ్డని పడుకోబెట్టి బొడ్డుపైన బంగారం ఉంచి నీళ్ళు పొయ్యాలి. అప్పుడే ఆ బిడ్డకి శుద్ధి అయినట్టు లెక్క అన్నమాట. పురిటాలికి, పురిటి బిడ్డకి ఒకేసారి సూర్యోదయానికి మునుపే ఏకకాలంలో స్నానం చేయించాలి. 

బాలింత స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తరవాత చాకలి తెచ్చిన (తన) చీరని కట్టించి ఒక గంట సేపు ఉంచాలి. బిడ్డకి కూడా చాకలి తెచ్చిన బట్టనే వేస్తారు (కడతారు). 11 వ రోజు శుద్ధి అయ్యిన తరవాతనే పిల్లలకి బట్టలు వేస్తారు. 10 రోజుల లోపు పిల్లలకి కొత్త, పాత బట్టలు అస్సలు వెయ్యకూడదు. కేవలం పాత గుడ్డముక్కలు కప్పి ఉంచుతారు అంతే. 

సూర్యోదయం అయ్యిన తరవాత బ్రాహ్మణుడు (పంతులు, పురోహితుడు) వచ్చి శుధ్ధి పుణ్యాహవచనం చేస్తారు. 11వ రోజు పురిటాలు ఇంట్లో తిరగవచ్చును. సూర్యాస్తమయం సమయం నుండి మళ్ళీ 21వ రోజు వరకు తల్లి-పిల్ల పురుడు పట్టాలి. అంటే ఎవరిని తాకకుండా దూరంగా ఉండాలి.

11వ రోజు తల్లి పిల్ల కోసం కాటుక అంగారు(నల్ల బొట్టు) వేస్తారు. ముందుగా కత్తికి వెల్లుల్లి రసం రాస్తారు. ఆముదం  దీపం వెలిగించి కత్తిని ఉంచుతారు కత్తికి నల్లగా మసి పడుతుంది. ఆ మసికి నెయ్యి కానీ, వెన్న కానీ కలిపి తల్లి-పిల్లలకి కంటికి కాటుక పెడతారు. ఆ విధంగా పిల్లలకి కాటుక 1సంవత్సరం పాటు పెడితే పిల్లలకి ఎంత పెద్ద వయసు వచ్చిన కంటి సమస్యలు రావని పెద్దల ఉవాచ. 

అంగారు - అంటే చంటి పిల్లలకి పెట్టే నల్ల బొట్టు. సగ్గుబియ్యాన్ని నల్లగా వేయించి అంటే బాగా మాడ్చి అందులో నీళ్ళు పోసి గింజ మెత్తగా ఉడికి చిక్కగా అయ్యే వరకు పొయ్యి పైనే ఉంచాలి. చల్లారిన తరవాత మెత్తగా గింజ కనిపించకుండా నూరుకోవాలి. ఆలా అయ్యిన మిశ్రమాన్ని ఒక ఖాళీ కొబ్బరిచిప్పలో ఉంచుకోవాలి. ఆ అంగారు రోజురోజుకీ ఎండిపోయి గట్టిబడుతుంది. చంటిబిడ్డకి బొట్టు పెట్టేటప్పుడు తడి చేయి చేసుకొని మిశ్రమాన్ని కలిపి బొట్టుగా పెట్టాలి.                    

No comments:

Post a Comment