October 29, 2022

పెళ్ళికి గోధుమరాయి / పసుపు కొట్టుట (విఘ్నేశ్వరుని బియ్యం మూటకట్టటం)

పెళ్ళికి గోధుమరాయి / పసుపు కొట్టుట (విఘ్నేశ్వరుని బియ్యం మూటకట్టటం)
కావలసిన సామాను 
పసుపు 
కుంకుమ 
బియ్యం 
తమలపాకులు 
వక్కలు 
అరటిపళ్ళు 
పసుపుకొమ్ములు 
మామిడాకులు 
చిల్లరనాణెలు 
తిరగలి (విసుర్రాయి) 
శనగలు...కందులు....పెసలు 
ఒక తెల్లని వస్త్రం 1/4 మీటరు 

ముందుగా తిరగాలి శుభ్రంగా కడిగి పసుపురాసి బొట్లుపెట్టి, తెల్లదారంతో 11 వరసలు తీసి ఒక పసుపుకొమ్ము, మామిడాకు కలిపి ముడి కట్టాలి. ఆ దారాన్ని తిరగలికి, మరొక దానిని తిరగలి కర్రకి కట్టాలి. ముహూర్తం సమయానికి పెళ్ళికొడుకుని/ పెళ్ళికూతురిని తూర్పు దిక్కుగా కూర్చోబెట్టి వాళ్ళ ఎదురుగ తిరగలి ఉంచి శనగలు, పెసలు, కందులని ఒక పళ్ళెంలో కలిపి తిరగలిలో వేసి ముత్తైదువులు అందరూ మూడు పిడికిళ్ళు వేసి విసరాలి. పేరంటానికి వచ్చిన ముత్తైదువలకి తాంబూలాలు ఇచ్చి పంపించాలి. కలిగి ఉంటే బంధువులకి భోజనాలు పెట్టుకోవాలి. పీటపై నుండి లేచే ముందు పెళ్లికూతురు/ పెళ్ళికొడుకుకి హారతి ఇవ్వాలి. 

పూర్వకాలంలో తిరగలిలో వేసి మెత్తగా తిప్పిన పప్పుల్ని పెళ్ళికి ఉపయోగించే కిరాణా సామానులలో కలిపేవారు. లేదా పెళ్ళికి ఉపయోగించే నాలుగుపిండిలో వేసి మర పట్టించేవారు.     

విఘ్నేశ్వరుని బియ్యం మూటకట్టటం
తెల్లని వస్త్రంలో ఒక పావు బియ్యం, పిడికెడు శనగపప్పు, చిన్న బెల్లం ముక్క వేసి, పసుపు వినాయకుడిని చేసి తమలపాకులో ఉంచి, ఒక తాంబూలాన్ని ఉంచి  విఘ్నేశ్వరుని తలచుకొని మూట కట్టి, దేవుని మూలన ఉంచాలి. పెళ్ళి అయ్యాక శనగపప్పు బియ్యాన్ని పరమాన్నంగా వండి దేవునికి నైవేద్యం పెట్టి అందరూ తినాలి.           

No comments:

Post a Comment